నల్లగొండ, ఫిబ్రవరి 18 : రాబోయే రెండు సంవత్సరాల్లో నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది స్మార్ట్ సిటీ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అదేవిధంగా రాబోయే 10 ఏళ్లలో నల్లగొండను ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. బుధవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. రూ.80 లక్షల వ్యయంతో అభివృద్ధి చేయనున్న పట్టణంలోని పద్మావతి కాలనీ పార్క్ పనులకు, అదేవిధంగా రూ.50 లక్షలతో అభివృద్ధి చేసే శివాజీ నగర్ పార్క్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. నల్లగొండలో ఇకపై రౌడీయిజం, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలను ఉక్కు పాదంతో అణచివేస్తామన్నారు. నల్లగొండ పట్టణాన్ని శాంతి సామరస్యాలకు, ప్రశాంత వాతావరణానికి నిలయంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.
నల్లగొండ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయనున్నట్లు అందులో భాగంగా పట్టణంలో పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అందులో భాగంగా ఇకపై ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు వారి డివిజన్ల పరిధిలో సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. పట్టణ ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 24 గంటలు తాగునీరు వచ్చేలా నీటి ట్యాంకులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. శానిటేషన్, పార్కుల అభివృద్ధి, పట్టణంలో విద్యుత్ లో ఓల్టేజి సమస్య లేకుండా పట్టణం చుట్టూ సబ్ స్టేషన్ల నిర్మాణం, లైన్ల మార్పిడి చేపట్టినట్లు చెప్పారు. రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. పట్టణంలోని అంగన్వాడీలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. బొట్టుగూడ పాఠశాల మాదిరిగానే మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. రూ.20 కోట్లతో న్యాక్ బిల్డింగు నిర్మాణంలో ఉందని, రూ.84 కోట్ల వ్యయంతో నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం పూర్తయినట్లు చెప్పారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ లైనింగ్ పనులు నిన్నటి నుండి ప్రారంభమైనట్లు మంత్రి తెలిపారు. బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ పట్టణంలో లతీఫ్ సాబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్ట ఘాట్ రోడ్లతో పాటు, ఔటర్ రింగ్ రోడ్, 8 సబ్ స్టేషన్లు నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు వివరించారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.

రెండేళ్లలో స్మార్ట్ సిటీగా నల్లగొండ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి