నీలగిరి, సెప్టెంబర్ 11 : మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు, గంజాయి నిర్మూలనపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల్లో 18 కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.52 లక్షల విలువైన 207.056 కేజీల గంజాయి, 118 గంజాయి చెట్లు, 173 మత్తు టాబ్లెట్స్ ను నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్లో గురువారం డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో నిర్వీర్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నా, వినియోగిస్తున్నా టోల్ ఫ్రీ నంబర్ 8712670266 కి సమాచారం తెలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.