– జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్
మిర్యాలగూడ, జూన్ 08 : యాసంగి ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే అత్యధికంగా 96,769 మంది రైతుల నుండి రూ.1,789 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సీజన్లో 459 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే అత్యదికంగా 2.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.1,570 కోట్లు జమ చేశామని, ఇంకా రూ.190 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.
బాయిల్డ్ బియ్యం 22 వేల మెట్రిక్ టన్నులు మిల్లర్ల నుండి సేకరించామన్నారు. నల్గొండ జిల్లాతో పాటు యాదాద్రి జిల్లా నుండి 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రస్తుతం మిర్యాలగూడ ప్రాంత మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఎస్.ఐ.ఆర్ సర్వేకు ప్రజలు సహకరించాలని, తమ ఓటు వివరాలు తెలియచేయాలని, ఇంటింటికి వచ్చిన సమయంలో అవసరమైన పత్రాలు అందించాలన్నారు. ఎలాంటి అపోహలకు లోనుకాకుండా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేకు సహకరించాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమణారెడ్డి ఉన్నారు.