యాదగిరిగుట్ట, ఏప్రిల్7 : నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్(నార్ముల్) చైర్మన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు గూడ మధుసూదన్ రెడ్డిపై ఆవిశ్వాసం తీర్మానం తప్పేలా లేదు. ఆయన తీరును బీఆర్ఎస్ పార్టీతోపాటు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నార్ముల్ డైరెక్టర్లు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
గత 6 నెలలుగా పాడి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్‌లో పెట్టడమే కాకుండా నార్మూల్ సంస్థ ఆస్తులు విక్రయించడం, సంస్థ నిధులను సొంతంగా ఖర్చు చేసుకోవడంపై డైరెక్టర్లు గుర్రుమంటున్నట్లు తెలిసింది. వెంటనే ఆయనను తొలగించి నూతన చైర్మన్‌ను ఎన్నుకునేందుకు 11 మంది డైరెక్టర్లు సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలోని రెడ్డి సత్రంలో రహస్యంగా సమావేశం నిర్వహించారు. ఇందులో 9 మంది డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు ఉన్నారు.
ఇష్టారాజ్యంగా చైర్మన్ వ్యవహారం
తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన గూడ మధుసూదన్‌రెడ్డి గతేడాది ఆక్టోబర్‌లో నార్ముల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో స్థానిక మంత్రి, ప్రభుత్వ విప్‌తో కలిసి పాడి రైతులపై హామీల వర్షం గుప్పించారు. 270 మంది పాల సంఘం చైర్మన్లతో క్యాంపులు నిర్వహించి వారిని మభ్యపెట్టాడు. తనను గెలిపిస్తే రూ. 5 బోనస్‌తోపాటు ప్రభుత్వ తరపు నుంచి రూ. 30 కోట్ల గ్యాంట్స్ తీసుకువస్తామని, గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లిస్తామని హామీలు ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన 6 నెలలు గడుస్తున్నా అమలు మాత్రం నోచుకోలేదు కదా, సంస్థను మూసివేసే పరిస్థితికి తీసుకొచ్చారని పలువురు పాల సంఘం చైర్మన్లు వాపోతున్నారు. ప్రస్తుతం 6 బిల్లులు పెండింగ్ పెట్టి పాడి రైతులకు సుమారుగా రూ. 20 కోట్లు అప్పు పెట్టాడని, సంస్థ అభ్యున్నతిని పక్కన పెట్టి సంస్థ నిధులతో రూ. 1.60 లక్షలతో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి జల్సాలు చేస్తున్నాడని పాడి రైతులు చెబుతున్నారు.
పాల సంఘాలతో కాకుండా ఇతర ప్రాంతాల్లో రోజుకు 40 వేల లీటర్ల పాలను అక్రమంగా కొనుగోలు చేసి, ఒక్కో లీటరుకు రూ. 2 కమీషన్‌తో రోజుకు రూ. 80 వేలు తన జేబులో వేసుకుంటున్నాడని రైతులు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే 6 బిల్లులు పెండింగ్‌లో పడినట్లు అనుమానిస్తున్నారు. అంతటితో ఆగక సంస్థకు చెందిన చిట్యాలలో 32 ఎకరాలు, మిర్యాలగూడలో 1.20 ఎకరాల భూమి దాదాపుగా రూ. 75 కోట్లు ఆస్తులను విక్రయించేందుకు పాలక మండలితో తీర్మానం సైతం చేశారు.
కాగా విక్రయాలను అడ్డుకునేందుకు మాజీ చైర్మన్ కోర్టును ఆశ్రయించారు. సంస్థను గాడిలో పెట్టే చైర్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై విసుగు చెందిన నార్ముల్ డైరెక్టర్లు, పాల సంఘం చైర్మన్లు ఆయనను పదవి నుంచి దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రామన్నపేట మండలంలోని నిదాన్పల్లికి చెందిన డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లికి చెందిన మరో డైరెక్టర్ కళ్లెపల్లి శ్రీశైలం చైర్మన్ రేసులో ఉన్నట్లు తెలుస్తున్నది.
పాలకవర్గం రద్దుకు 270 మంది సంఘం చైర్మన్ల మొగ్గు
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, నార్ముల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డితోపాటు ముగ్గురు మాజీ డైరెక్టర్లు ఒగ్గు భిక్షపతి, కాయితి వెంకట్‌రెడ్డి, మోతె సోమిరెడ్డి కలిసి జిల్లాకు చెందిన 30 మంది పాల సంఘం చైర్మన్లతో రహస్యంగా సమావేశమయ్యారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాకు చెందిన 270 మంది చైర్మన్లు పాలకవర్గాన్ని రద్దు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సంస్థ మూత పడకముందే సమర్థవంతుడైన నాయకుడికి చైర్మన్‌గా నియమిస్తే రైతులకు పాల బిల్లు అందడంతో పాటు సంస్థను లాభాల బాటలో నడిపింవచ్చునన్న నిర్ణయానికి వచ్చిన్నట్లు ఓ మాజీ డైరెక్టర్ వివరించారు.
11 మంది డైరెక్టర్లు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వద్ద వెళ్లి సమస్యను విన్నవించారని, పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గడువు కోరినట్లు నార్మూల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు పాడి రైతులకు న్యాయం జరుగకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. సొంత పార్టీకి చెందిన డైరెక్టర్లు వ్యతిరేకంగా ఉండటంతో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.