నీలగిరి, జూన్ 25 : రంగునీళ్లతో నగదు రెట్టింపు చేస్తామని చెప్పి రూ.33 లక్షలతో ఉడాయించిన బిహార్ రాష్ర్టానికి చెందిన మోసగాళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.24లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. నాలుగు సంవత్సరాల కితం నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు శ్రీరామోజు రామాచారి ఇంటి నిర్మాణం కోసం బిహార్ రాష్ట్రానికి చెందిన రామ్ నరేశ్ యాదవ్ తాపీ మేస్త్రీగా పనిచేశాడు. ఇల్లు పూర్తయినా రామ్‌నరేశ్ రామాచారితో సంబంధాలు కొనసాగించాడు.
ఈ క్రమంలో సులభంగా నగదు సంపాదించాలనే ఉద్దేశంతో రామాచారికి గ్రామంలో పలుకుబడి, డబ్బులు బాగా ఉన్నట్లు గ్రహించాడు. దాంతో రామ్‌నరేశ్ యాదవ్ తన స్నేహితుడు షేక్ సిరాజ్ వద్ద రంగునీళ్లు ఉన్నాయని, వాటి ద్వారా నగదు రెట్టింపు అవుతుందని నమ్మించాడు. రెండు నెలల కితం రామ్‌నరేశ్, షేక్ సిరాజ్ చందనపల్లికి వచ్చి తమ వద్ద ఉన్న లిక్విడ్‌లో రూ.6,500 ఉంచి వాటిని రూ.13,000గా మార్చి రామాచారికి నమ్మకం కలిగేలా చేశారు. ఆ తర్వాత చిన్న మొత్తంలో కాకుండా పెద్ద మొత్తంలో నగదు రెట్టింపు చేస్తామని రామాచారికి డబ్బులు తయారు చేసుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. ఆశపడ్డ రామాచారి భూమి కొనుగోలు పేరుతో తన వద్ద ఉన్న బంగారంతోపాటు స్నేహితుల, బంధువుల వద్ద అప్పుగా రూ. 33 లక్షలు తీసుకొచ్చాడు.
ఈ నెల 22న ఉదయం రామాచారి ఇంటికి రామ్‌నరేశ్, షేక్ సిరాజ్ చేరుకుని వారి వెంట తెచ్చుకున్న లిక్విడ్‌ని ఒక బకెట్లో పోసి రూ.50 వేల కట్టలను ఆరింటిని(మూడు లక్షలు) ఒకసారి లిక్విడ్‌లో ముంచి బయటకు తీసి, వాటికి వారి వద్ద ఉన్న తెలుపు, బ్రౌన్ కలర్ ప్లాస్టర్లు వేసి ఒక బండిల్‌గా చేశారు. అలా రూ.3 లక్షలు ఒక కట్ట చొప్పున మొత్తం రూ.33 లక్షలను 11 కట్టలుగా వాటిని కూడా మూడు పెద్ద బండిల్స్‌గా కట్టి లిక్విడ్‌లో ముంచారు. ఒక గంట తర్వాత వాటిని స్టవ్‌పై వేడిచేసి ఒక రోజు తర్వాత ఓపెన్ చేస్తే ఆ డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పారు. ఈ తతంగం అంత రామాచారితోపాటు ఆయన బావమరిది అమరేంద్రచారి కూడా పర్యవేక్షణ చేశారు. కానీ ఇంతలో అమరేంద్రచారి ఇంటిలో పని ఉందని, గంట తర్వాత వస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
రామాచారి కూడా ఇంటికి రోగి రావడంతో ఫ్లైఫ్లోర్ నుంచి కిందికి వచ్చాడు. ఆ సమయంలో అక్కడునున్నఇద్దరు అప్పటికే వారి వెంట బ్యాగులో ఒక కట్టకి పైన, ఒకటి కింద ఒకటి ఒరిజినల్ రూ.500 నోట్లు పెట్టి మధ్యలో తెల్లటి కాగితాలను పెట్టి ప్యాక్ చేసి ఉంచిన డబ్బు కట్టలను నిజమైన కట్టల స్థానంలో ఉంచి వాటిని నేరస్తుల బ్యాగులలో పెట్టుకొన్నారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి లేబుల్స్ తీసుకొని ఉదయం వస్తామని చెప్పి పరారయ్యారు. తర్వాత వాటిని రామాచారి ఓపెన్ చేయగా అందులో తెల్లపేపర్లు ఉండడంతో మోసపోయినట్లు గ్రహించి వెంటనే నల్లగొండ రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
రూ.33 లక్షలతో పరారైన నిందితులను నల్లగొండ రూరల్ ఎస్ఐ శివకుమార్ 24 గంటల్లోపే అదుపులోకి తీసుకొని రూ.24 లక్షలు రికవరీ చేశారు. ఎస్ఐ శివ కుమార్ కానిస్టేబుళ్లు తిరుమలేశ్, జానకి రాములు, హోం గార్డ్ సలీమ్‌తో మూడు టీమ్‌లను ఏర్పాటు చేసి మమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, సీఐ డానియల్ కుమార్ సహకారంతో ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ సలహాలు తీసుకున్నారు. ఈ క్రమంలో నల్లగొండ రైల్వే స్టేషన్లో బిహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి బ్యాగులను తనిఖీ చేయగా అందులో రూ. రూ.24 లక్షలు దొరికాయి. ఈ కేసులో మూడో వ్యక్తి షేక్ అఫ్తాబ్ రూ.9 లక్షలతో బిహార్‌కు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, నల్లగొండ టూ టౌన్ సీఐ డానియల్ కుమార్, నల్లగొండ రూరల్ ఎస్ఐ శివ కుమార్, కానిస్టేబుల్ తిరుమలేశ్, జానకి రాములు, హోమ్‌గార్డ్ సలీమ్ పాల్గొన్నారు.