సూర్యాపేట రూరల్ : ఈ శివరాత్రి నుంచైనా పాలకుల్లో మార్పు రావాలని, ఇకనైనా ఈ ప్రభుత్వం ఐక్యతతో, అవగాహన పెంచుకొని అభివృద్ధి పాలన సాగించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మహా శివరాత్రి సందర్భంగా సూర్యాపేట పట్టణ పరిధి పిల్లలమర్రి శివాలయాల్లో ఆయన తమ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ఘటనపై త్వరగా క్లారిటీ తీసుకురావాలని, దీనిపై ప్రభుత్వం త్వరగా విచారణ జరిపి బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరిపై శివయ్య ఆశీస్సులు ఉండాలని, భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని తెలిపారు.
రామగిరి, ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి వేడుకలు ఉమ్మడి నల్లగొండ వ్యాప్తంగా బుధవారం వైభవంగా జరిగాయి. ఆలయాల్లో శివలింగాలకు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పలుచోట్ల పార్వతీ పరమేశ్వరుడి కల్యాణోత్సవాలు చేపట్టారు. స్వామివారి దర్శనానికి ఆలయాలకు భక్తులు బారులుదీరారు. ఉపవాసాలు, జాగరణతో పరమ శివుడిని కొలిచారు. శివ నామస్మరణ, భక్తి పాటలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పలు ఆలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పూజలు చేశారు.