నల్లగొండ, జులై 05 : విపత్తుల నిర్వహణకు నల్లగొండ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారుల బృందం జాయింట్ అడ్వైజర్ నావెల్ ప్రకాశ్, అండర్ సెక్రెటరీ అభిషేక్ బిస్వాల్, వసీం ఇక్బాల్‌తో కూడిన బృందం రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధికారి గౌతమ్ ఆధ్వర్యంలో ఒక రోజు నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్‌ను ఆమె చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో విపత్తుల నిర్వహణ అథారిటీ ఉన్నట్లుగానే జిల్లా స్థాయిలో జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేసినట్లు వెల్లడించారు. వివిధ సందర్భాల్లో వచ్చే విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా తుఫాను, వరదలు, తదితర ప్రకృతి వైపరీత్యాల పరిధిలో లేనప్పటికీ ఒకవేళ విపత్తులు సంభవిస్తే ఎలా స్పందించాలో ప్రణాళిక ఉన్నట్లు చెప్పారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. జిల్లాలో 12వ పోలీస్ బెటాలియన్ ఉందని, ఒక కంపెనీ దళాలు (సుమారు 80 నుండి 100 మంది) కి విపత్తు నిర్వహణపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ జాయింట్ అడ్వైజర్ నావెల్ ప్రకాశ్ మాట్లాడుతూ… జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ కింద 2021లో ఆపదమిత్ర వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని జిల్లాల్లో ఆపద మిత్రలను ఏర్పాటు చేస్తున్నామని, అంతేకాక విపత్తుల సమయంలో అవసరమైన రిసోర్సెస్ ఏర్పాటు చేస్తున్నామని, ఆపద మిత్రుల శిక్షణ, విపత్తుల్లో వారు తీసుకోబోయే చర్యలపై అవసరమైన సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.