మునుగోడు, డిసెంబర్ 12 : అన్నదాతలకు పంటల సాగుపై అవహగాన కల్పించేందుకు, నూతన పద్ధతుల గురించి వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్లసర్కో రైతు వేదికను నిర్మించింది. వీటిల్లో సదస్సుల నిర్వహణతోపాటు కొత్త వంగడాలు, సాగు పద్ధతులపై వ్యవసాయ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. గ్రామాల్లో రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్న వీటి నిర్వహణకు రాష్ట్ర సర్కారు నిధులు ఇచ్చింది. ఒక్కో వేదికకు నెలకు రూ.9వేల చొప్పున ఐదు నెలలకు సంబంధించి రూ.45వేలు ఇటీవల విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో 314 రైతు వేదికలు ఉండగా.. 1.41కోట్ల రూపాయలను జిల్లా వ్యవసాయ కార్యాలయానికి జమ చేశారు. ఆ నిధులను క్లస్టర్ల వారీగా అందజేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డీఏఓ పర్యవేక్షణలో ఏఈఓలు ఖర్చు చేయనున్నారు.
రైతులను ఏకతాటిపై తెచ్చేలా..
రైతన్న తనకున్న పరిజ్ఞానంతోనే పంటలు సాగు చేస్తూ వచ్చిన దిగుబడులను మహాప్రసాదంగా భావిస్తుంటాడు. కానీ.. పంటల మార్పిడి ఎలా చేయాలి.. ఆధునిక విధానంలో సేంద్రియ వ్యవసాయం ఎలా? ఏ విధంగా చేస్తే పంట అధికంగా పండుతుంది అనే విషయాలపై అవగాహన లేని పరిస్థితి. ఈ క్రమంలో అన్నదాతల అగచాట్లను గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఆధునిక సాగుపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను నిర్మించారు.
రైతులకు చేరువైన వ్యవసాయ శాఖ సేవలు
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక విస్తరణాధికారిని నియమించింది. వారి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైతు వేదికలను నిర్మించింది. క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రైతుబంధు గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. వారు రైతులకు, సర్కారుకు అనుసంధాన కర్తలుగా పని చేస్తున్నారు. వ్యవసాయ సంబంధిత సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించేందుకు రైతు వేదికలను వినియోగించుకోవాల్సి ఉంది. ఇందుకోసం రైతుబంధు మండల బాధ్యుడికి ప్రత్యేక గదిని, సామగ్రిని సమకూర్చింది. ప్రతి విస్తరణాధికారి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో గంట సేపు రైతు వేదికల్లో రైతులకు అందుబాటులో ఉండాలని, అనంతరం క్షేత్ర సందర్శనకు వెళ్లాలని ఆదేశించింది. రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల కావడంతో ఇక నుంచి మరింత సమర్థవంతంగా సాగుతుందని రైతులు భావిస్తున్నారు.
మెరుగైన సేవలందించేలా చర్యలు
ప్రభ్వుతం కేటాయించిన నిధులు పారదర్శకంగా ఖర్చు చేయాలని సిబ్బందికి సూచించాం. ప్రస్తుతం ఒక్కో క్లస్టర్రు రూ.45వేలు విడుదలయ్యయి. దాదాపు అన్ని చోట్లా సౌకర్యాలు, అవసరమైన వసతులు కల్పించాం. ఇకపై వేదికల ద్వారానే ఏఈఓలు సేవలందించాలని ఆదేశించాం.
– డి.ఎల్లయ్య, డివిజన్ వ్యవసాయాధికారి, మునుగోడు