రామగిరి, నవంబర్ 24 : దేశంలోని రైతుల సమస్యలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నదని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించడంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకుందన్నారు. అయితే పంటల సాగుకు అనుగుణంగా చట్టం చేసి పార్లమెంట్లో ఆమోదించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటబీమా సౌకర్యం కల్పించాలని, ధాన్యానికి గిట్టుబాటు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్నిధి పథకాన్ని రూ. 6 నుంచి రూ. 18వేలకు పెంచాలన్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు నల్లగొండలో నిర్వహించే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేలా తీర్మానాలు చేస్తామన్నారు. నల్లగొండలో జరిగే బహురంగ సభకు 30వేలకు పైగా రైతులు తరలి రానున్నట్లు చెప్పారు. ఈ నెల 27న సభల తొలిరోజు నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్ల, అధ్యక్షుడు డాక్టర్ అశోక్థావలే హాజరు కానున్నట్లు చెప్పారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు పాలడుగు నాగార్జున, బండా శ్రీశైలం, సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి పాల్గొన్నారు.