పట్టణ జనాభాతోపాటు వివిధ పనుల కోసం పలు ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో మిర్యాలగూడ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇందుకు సరిపడా మార్కెట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు ఒకేచోట లభించేలా ప్రభుత్వం విశాలమైన స్థలంలో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపడుతున్నది. రూ.4.50కోట్లతో 108 దుకాణాలు నిర్మిస్తుండగా.. అది పూర్తయితే ప్రజలు, వ్యాపారుల ఇబ్బందులు తప్పనున్నాయి.
– మిర్యాలగూడ, నవంబర్ 21
మిర్యాలగూడలో ఇప్పటి వరకు కూరగాయలు, పండ్లు, మాంసం, చేపల మార్కెట్లు వేర్వేరు చోట్ల ఉండడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవన్నీ ప్రజలకు ఒకేచోట లభించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో రూ.4.50 కోట్లతో దుకాణ సముదాయాలను నిర్మిస్తున్నది. నిర్మాణ పనులు ఆరు నెలల్లో పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
సమీకృత మార్కెట్లో 108 దుకాణాలు నిర్మిస్తున్నారు. ఇందులో 60 కూరగాయల దుకాణాలు, 18 పూలు, పండ్లకు సంబంధించినవి, 30 దుకాణాలను మాంసాహార విక్రయాలకు కేటాయించనున్నారు. ప్రస్తుతం నేతాజీ కూరగాయల మార్కెట్లో కూరగాయలు, చికెన్, చేపల దుకాణాలు ఉండగా.. మాంసం విక్రయాలు రోడ్ల వెంట జరుపుతున్నారు. రైతు బజారులో మాంసం విక్రయాలకు ప్రత్యేకంగా దుకాణాలు కేటాయించినా వ్యాపారులు ముందుకు రాకపోవడంతో నిరుపయోగంగా మారాయి. రైతు బజార్ పక్కన చేపల విక్రయాలు కొనసాగుతున్నాయి. సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తయితే అన్నీ ఒకేచోట లభించడంతోపాటు వాహనదారులకు పార్కింగ్ సమస్య తీరనుంది.
మిర్యాలగూడ పట్టణంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన సమీకృత మార్కెట్ నిర్మిస్తే సౌలభ్యంగా ఉంటుంది. కూరగాయలు, పండ్లు, పూలు, మటన్, చికెన్, గుడ్లు అన్నీ ఒకేచోట లభించడం వల్ల ప్రజలకు మంచి సౌకర్యంగా ఉంటుంది. వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి.
– తిరందాసు విష్ణు, మిర్యాలగూడ