జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో త్వరలో ప్రారంభించనున్న టీఎస్ బీపాస్‌తో సహా ఇతర ధ్రువపత్రాలు జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో జిల్లాలో కొన్ని పంచాయతీల్లో ఉచిత అంతర్జాల సౌకర్యం ఏర్పాటు చేసేందుకు సౌర విద్యుత్ పలకలు గతంలోనే పంపిణీ చేసింది. కానీ, అవి ఉపయోగంలోనికి రాలేదు. ప్రస్తుతం డిజటల్ ధ్రువపత్రాల జారీ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మిగిలిన అన్ని గ్రామ పంచాయతీలకు సౌర విద్యుత్ పలకలు పంపిణీ చేశారు. ఇప్పటికే బిగింపు పనులు పూర్తికావచ్చాయి.
విద్యుత్ సౌకర్యం లేకపోయినా…
విద్యుత్ సౌకర్య లేకపోయినా అంతరాయం లేకుండా సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు ఉండగా పూర్తిస్థాయి గ్రామ పంచాయతీ భవనాలున్న గ్రామాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సొంత భవనాలు లేని గ్రామాల్లోని ప్రత్యామ్నాయ భవనాల్లో(గ్రామాల్లోని సామాజిక, మాహిళా సమాఖ్య భవనాల్లో) తాజాగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాల్సి రావడంతో సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీల పరిధిలో ప్రజలకు అందించే ధ్రువపత్రాలు నేరుగా కార్యదర్శులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
టీఎస్ బీపాస్ నేపథ్యంలో..
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణ అనుమతులు ఇష్టారాజ్యంగా ఉండేవి. అక్రమ లేఅవుట్లు, ఆక్రమణలు చోటుచేసుకుంటుండటంతో ప్రభుత్వం టీఎస్-బీపాస్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దాంతో గ్రామపంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి డిజిటల్ ధ్రువపత్రాలు అందజేయనున్నారు.
ఇంటర్నెట్ లేదనే సాకు చెప్పకుండా..
ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలిస్తూ వాటికి సంబంధించి వివరాలు, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి, ఉపాధి హామీ పనులు, పంచాయతీ నిధులు, ఆదాయ, వ్యయాలను కంప్యూటర్లో ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. గతంలో మాదిరిగా ఇంటర్నెట్ సౌకర్య లేదని సాకులు చెప్పే వీలు లేకుండా పరికరాలను బిగిస్తున్నారు.
్రగ్రామాల్లోనే ధ్రువపత్రాలు తీసుకోవచ్చు
ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లా వ్యాప్తంగా ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. సంబంధిత కంపెనీ బిగిస్తుంది. పనులు పూర్తయితే అన్ని రకాల ధ్రువపత్రాలు, అనుమతులు పంచాయతీల్లోనే నేరుగా తీసుకునే అవకాశం ఉంటుంది.
-విష్ణువర్ధన్‌రెడ్డి, డీపీఓ, నల్లగొండ