మర్రిగూడ, నవంబర్ 19 : సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడని, అందుకే అన్ని వర్గాల ప్రజలకోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక విజయ ఫంక్షన్హాల్లో మండలంలోని 154 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.1.54 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, తన సొంత ఖర్చుతో చీరెలను అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అందుకే కేసీఆర్ వంటి నాయకుడు తమకూ కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
గొల్ల కురుమలు గొర్రెల యూనిట్ల కొనుగోలుకు ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేసిందన్నారు. నగదును డ్రా చేసుకోకుండా నిలుపుదల చేయాలని బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో లబ్ధిదారుల ఖాతాలు ఫ్రీజ్ చేశారన్నారు. చంపినోడే దండేసి దండం పెట్టినట్లుగా గొల్ల కురుమల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో ధర్నా చేయడం సిగ్గు చేటన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి రాని రాజగోపాల్‌రెడ్డి ప్రజల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నాడని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులని బీజేపీ నాయకుల కుట్రలను గమనిస్తున్నారన్నారు.
ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
ఉప ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత మొదటి సారిగా మర్రిగూడకు వచ్చిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేశ్‌గౌడ్, తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, కోఆప్షన్ సభ్యుడు ఎండీ.యాకూబ్అలీ, స్థానిక సర్పంచ్ నల్ల యాదయ్య, సహకార సంఘం చైర్మన్లు పందుల యాదయ్యగౌడ్, బాలం నర్సింహ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి ఐతగోని వెంకటయ్యగౌడ్, ఉపాధ్యక్షులు మారగోని రామన్న, పందుల పాండుగౌడ్, కల్లు నవీన్‌రెడ్డి, వూరిపక్క నగేశ్, గ్రామశాఖ అధ్యక్షుడు రాపోలు యాదగిరి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.