ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నది. ఉదయం 9గంటల వరకూ మంచు కురుస్తూనే ఉంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4డిగ్రీలు తక్కువ నమోదవుతున్నాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి వాతావరణంలో వైరస్లు విజృంభించే అవకాశం ఉందని చెప్తున్నారు. సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్లు వంటివి పెరుగుతాయని హెచ్చరిస్తూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలిస్తున్నారు. వ్యాధుల కట్టడికి అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటున్నది.
సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం
చలికాలంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. కాలుష్యం, సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల గాలి, నీరు క్రిమికీటకాల నుంచి రోగాలు వ్యాపిస్తాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దగ్గు, జలుబు, ఆస్తమా, చర్మ సంబంధ వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇన్ఫ్ల్యూయెంజా, ఫ్లూ వైరస్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో తేమ శాతం తగ్గి రక్షణ శక్తి సన్నగిల్లుతుంది.
వాతావరణ కాలుష్యం, బహిరంగ ధూమపానంతో గొంతు సంబంధిత వ్యాధులు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల్లోని దవాఖానల్లో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. దవాఖానల్లో సరిపడా మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ వారానికోసారి డ్రైడే నిర్వహిస్తున్నది. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నది.
జాగ్రత్తలు పాటించాల్సిందే..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం వాతావరణంలో వైరస్ విజృంభించే అవకాశం ఉంది. గొంతు నొప్పి, ఆస్తమా, ఫ్లూ ప్రబలుతాయి. కీళ్లలో నొప్పి మొదలవుతుంది. చర్మం పొడిగా మారుతుంది. టైఫాయిడ్ జ్వరాలు పెరిగే అవకాశం ఉంది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. రోగాలు దరి చేరకుండా జాగ్రత్తలు పాటించాలి.
– డాక్టర్ మల్లికార్జునరావు, డీఎంహెచ్ఓ