నల్లగొండ జిల్లా వైద్యరంగంలో మరో అడుగు ముందుకు పడింది. పుట్టిన పిల్లల నుంచి సంవత్సరంలోపు చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా జిల్లా జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన పిల్లల ఐసీయూను జిల్లా యంత్రాంగం అందుబాటులోకి తెచ్చింది. పుట్టిన పిల్లలు న్యుమోనియా, శ్వాస సంబంధిత, కామెర్లు తదితర ప్రమాదకర వ్యాధుల బారిన పడి ప్రైవేట్ దవాఖానలు, హైదరాబాద్‌కు పరుగులు తీసేవారు. తల్లి ఒక చోట, పిల్లలు ఒకచోట ఉండి చికిత్స పొందుతూ అనేక ఇబ్బందులు పడేవారు. ఇక అలాంటి కష్టాలు లేకుండా జిల్లా కేంద్రంలోనే కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక వైద్య సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వసతులను చూసిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని సేవల ఇక్కడే..
జిల్లా జనరల్ దవాఖానలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసీయూలో అన్ని రకాల సేవలు అందనున్నాయి. న్యుమోనియా, కామెర్లు లాంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడిన చిన్నారులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించనున్నారు. వైద్యులు, సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించడంతో పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు
సీమాంధ్రుల పాలనలో నిర్లక్ష్యానికి గురైన వైద్య వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటికే నల్లగొండకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతోపాటు ఎన్నో రకాల వైద్యసేవలను నిరుపేదలకు అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా 12 పడకలతో ఐసీయూను ఏర్పాటు చేశారు. పుట్టిన పిల్లలు అనారోగ్యం బారిన పడితే హైదరాబాద్ వెళ్లకుండా నల్లగొండలోనే వైద్య సేవలు అందించనున్నారు.
వైద్యరంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట
అనేక పోరాటాలు, త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో నిరుపేదలకు వైద్యాన్ని మరింత చేరువ చేయడానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా జనరల్ దవాఖానలో కొత్తగా ఏర్పాటు చేసిన చిన్నారుల ఐసీయూను ఆయన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014కు ముందు సర్కారు దవాఖానకు ప్రజలు వచ్చే వారు కాదని, సీఎం కేసీఆర్ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ స్థాయి వైద్యం అందే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశారని తెలిపారు. నేడు పీహెచ్సీ నుంచి జిల్లా దవాఖాన వరకు ప్రజలు సర్కారు దవాఖానలో వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డా.లచ్చునాయక్, ప్రిన్సిపాల్ రాజకుమారి, రజిని, డాక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, దామెర యాదయ్య, ఏవీ శ్రీనివాస్‌రావు సిబ్బంది, ఏర్పుల కామేశ్వర్, మాండ్ర వెంకన్న పాల్గొన్నారు.