మునుగోడు, నవంబర్18: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2,093 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా పరిధిలో అనుముల, చింతపల్లి, దామర్లచర్ల, దేవరకొండ, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్, నల్లగొండలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటిల్లో 83,996 మంది ఆరేండ్లలోపు చిన్నారులు ఉన్నారు. మూడేండ్లు దాటిన చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతోపాటు పౌష్టకాహారం అందిస్తున్నారు, మహిళల్లో రక్తహీనత నివారణకు ఆర్యోగ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో చిన్నారుల వయసుకు తగిన ఎతు,్త బరువును నిర్వాహకులు నమోదు చేస్తారు. ప్రత్యేకించి సెప్టెంబర్‌లో పోషణ మాసోత్సవం ద్వారా అనేక చైతన్య అవగాహన కార్యక్రమాలు కొనసాగుతుంటాయి.
యాప్‌లో వివరాలు నమోదు
ఈ నవంబర్ నుంచి జిల్లాలో ఎన్హెచ్టీఎస్కు అనుబంధంగా ప్రత్యేక పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమం (సూపర్ వైజరీ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాం) అమలు చేయనున్నారు. పోషకలోపంతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌లో అంగన్వాడీల విధుల నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయనున్నారు. ఉపాధ్యాయుల హాజరు, చిన్నారుల ఎదుగుదల పర్యవేక్షణ అంశాలు నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. యాప్ అమలు చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు ప్రాజెక్టుల వారీగా శిక్షణ కొనసాగుతున్నది. ఈ నెలలో యాప్‌పై ప్రయోగాత్మకంగా తెలియజేసి డిసెంబర్ 1నుంచి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నారు. గత పోషణ మాసోత్సవంలో జిల్లా వ్యాప్తంగా తక్కువ బరువు ఉన్న 3,327 మంది, తీవ్ర పోషకాహార లోపం ఉన్న 1,151 మంది చిన్నారులను గుర్తించారు. జిల్లాలో అమలవుతున్న ఈ కార్యక్రమాన్ని ఎన్‌హెచ్‌టీఎస్ జిల్లా కోఆర్డినేటర్ సతీశ్ పర్యవేక్షణలో జరుగుతుంది.