భువనగిరి అర్బన్, నవంబర్ 18 : ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జాగృతి నాయకులు ఖండించారు. జాగృతి రాష్ట్ర నాయకుడు చందుపట్ల సుజిత్‌రావు ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక చౌరస్తాలో శుక్రవారం అరవింద్ ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి దహనం చేశారు. ఈ సందర్భంగా సుజిత్‌రావు మాట్లాడుతూ మహిళ అని చూడకుండా దూషించడం సరికాదన్నారు. తెలంగాణ ఆడబిడ్డను అవమానించడం మానుకుని చేతనైతే నిజామాబాద్‌ను అభివృద్ధి చేయాలని హితవు పలికారు. అభివృద్ధి చేతకాని అరవింద్‌కు నిజామాబాద్ మహిళలే బుద్ధి చెప్తారని, మహిళలంతా ఏకమైతే పాతాళం పోతావని హెచ్చరించారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకుడు తంగెళ్లపల్లి శ్రీకాంత్, జిల్లా నాయకులు తుంగతుర్తి సంతోష్, నరేశ్, శ్రీకాంత్, సునీల్, జలీల్, వెంకట్, సురేశ్, చౌదరి, కళ్యాణ్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎంపీ అరవింద్ అనుచిత వాఖ్యలు మానుకోవాలి:ఎంపీపీ సుశీల
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎంపీ అరవింద్ అనుచిత వాఖ్యలను మానుకోవాలని లేకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని ఆరోపిస్తూ అరవింద్ అనుచిత వాఖ్యలు చేయడం హేయమన్నారు. మహిళా ప్రజాప్రతినిధిని గౌరవించలేని సంస్కార హీనుడు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదన్నారు. మరోసారి టీఆర్ఎస్ నాయకులపై అనుచిత వాఖ్యాలు చేస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ మహదేవుని శ్రీనివాస్, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుంకరి శట్టయ్య, రవీందర్‌నాయక్, మోతీరాం, బాలూనాయక్ పాల్గొన్నారు.
అరవింద్ ఆరోపణలు హాస్యాస్పదం
ప్రాణాలు సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్, జాగృతి కవితపై బీజేపీ నాయకుడు అరవింద్ అసత్య ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్ బాణాల కవితానాగరాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్న బీజేపీని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కవితపై ఇంకోసారి అసత్య ఆరోపణలు చేస్తే రాష్ట్రంలో ఎక్కడా తిరగనిచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించారు.