సూర్యాపేట, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి తర్వాత ప్రధానంగా పండించేది పత్తి. కానీ కేంద్ర ప్రభుత్వం సరిపడా సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. దాంతో దూర ప్రాంతాలకు పత్తిని తీసుకెళ్లలేని రైతులు దళారులకు విక్రయించి నష్టపోతున్నారు. పత్తి రైతుల ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఉన్నత స్థాయిలో మాట్లాడి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాటు చేశారు. శుక్రవారం మంత్రి చేతుల మీదుగా కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు సూర్యాపేటలోనే మొదటిసారిగా జరుగబోతున్నాయి. రాష్ట్రంలో ఇది 21వది. ఈ నామ్ విధానం ద్వారా ఆన్లైన్ టెండర్లు వేసి వ్యాపారులు పత్తిని కొనుగోలు చేయనుండగా పోటీతత్వం పెరిగి రైతులకు అధిక ధర లభించే అవకాశం ఉన్నది. సూర్యాపేట మార్కెట్లో ప్రస్తుతం వరి, కంది, పెసర, వేరుశనగ పంటల మాదిరిగా పత్తిని కూడా విక్రయించుకునేలా ఏర్పాటు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పొలాలకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, సీజన్ ప్రారంభానికి ముందే ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను ఆదుకుంటున్న విషయం తెలిసిందే. అంతటితోనే వదిలేయకుండా పంట చేతికొచ్చాక శ్రమకు తగ్గ ఫలితం దక్కేలా, రైతన్నల వ్యయ ప్రయాసలను తగ్గించేలా వారి చెంతనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో భాగంగానే సూర్యాపేట మార్కెట్లో శుక్రవారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. దళారుల మోసాలకు చెక్ పెడుతూ ఈ నామ్ విధానంలో జరిగే కొనుగోళ్లతో రైతులకు మంచి ధర దక్కనున్నది.
ఉమ్మడి జిల్లాలో మొదటిగా సూర్యాపేటలోనే..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 19 వ్యవసాయ మార్కెట్లు ఉండగా పత్తి కొనుగోళ్లు చేస్తున్న తొలి మార్కెట్ సూర్యాపేట మార్కెట్. రాష్ట్రంలోని 198 మార్కెట్లలో ఇది 21వది కావడం గమనార్హం. మంత్రి జగదీశ్‌రెడ్డి కృషితో సూర్యాపేట మార్కెట్లో పత్తి మార్కెట్ ఏర్పాటైంది. దీంతో ఇప్పటి వరకు ధాన్యం, అపరాలు, ఇతర పంటలను ట్రేడర్లు ఎలా కొనుగోలు చేస్తున్నారో అదే మాదిరి పత్తిని కూడా కొనుగోలు చేసేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
దళారుల మోసాలకు చెక్
ఓపెన్ మార్కెట్లో దళారులు కుమ్మక్కై కాంటాల్లో మోసాలు, ధరలు ఇవ్వడంలో రైతులను మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీజన్ వస్తే చాలు దూర ప్రాంతాలకు చెందిన జిన్నింగ్ మిల్లుల యజమానులు, కొంతమంది వ్యాపారులు గ్రామాల్లో దళారులను ఏర్పాటు చేసుకుని పత్తి కొనుగోలు చేయడం రివాజుగా ఉంది. కొనుగోళ్ల విషయంలో తరచూ గొడవలు, ఘర్షణలు కూడా చోటుచేసుకున్న సంఘటనలు అనేకం. ఇక మీదట అలాంటి మోసాలకు చెక్ పడనుంది. సూర్యాపేట మార్కెట్లో పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ఈ నామ్ ద్వారా జరుగుతుంది. వ్యాపారులు ఆన్లైన్ ద్వారా ధరలు వేసి కొనుగోలు చేస్తారు. ఎవరు అధిక ధరలకు కోట్ చేస్తే వారికే దక్కనున్నది. సూర్యాపేటలో 126 మంది కమీషన్‌దారులు, 15 మంది ట్రేడర్స్, వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు కొనుగోళ్లలో పాల్గొననున్నారు.
పత్తికి అధిక ధర దక్కే అవకాశం
పత్తి మార్కెట్ స్థానికంగానే ప్రారంభిస్తుండడంతో పంటకు అధిక ధరలు పలికే అవకాశాలు ఉంటాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.6,380 ఉంది. డిమాండ్ అధికంగా ఉండడంతో బహిరంగ మార్కెట్లో క్వింటాకు రూ.7,500 నుంచి 8,500 వరకు పలుకుతోంది. అయితే మార్కెట్లో పత్తి కొనుగోళ్లకు ఈ నామ్ ప్రక్రియ ద్వారా ఆన్లైన్ టెండర్లు వేయనుండడంతో డిమాండ్‌కు అనుగుణంగా ధరలు పెరిగే అవకాశం ఉన్నదని పలువురు చెబుతున్నారు.
పత్తిని ఆరబెట్టుకొని తేవాలి
మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో వచ్చిన పత్తి కొనుగోళ్ల ప్రక్రియను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఓపెన్ మార్కెట్లో ప్రస్తుతం పత్తికి మంచి డిమాండ్ ఉండడంతో చేతికి వచ్చిన పత్తి పంటలను పూర్తిగా ఆరబెట్టుకుని 8-12 శాతం లోపు తేమతో మార్కెట్‌కు తీసుకువచ్చి మంచి ధరను పొందాలి. గ్రామాల్లో దళారులకు పత్తిని అమ్మి మోసపోవద్దు. ఇతర పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చినట్లే పత్తిని కూడా తీసుకురావాలి.
– ఎండీ ఫసియుద్దీన్, మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి, సూర్యాపేట
పత్తి మార్కెట్ ఏర్పాటు హర్షణీయం
నాకు రెండు ఎకరాల భూమి ఉంది. ఒక ఎకరంలో పత్తి మరో ఎకరంలో వరి వేశాను. ధాన్యాన్ని విక్రయించేందుకు సూర్యాపేట మార్కెట్‌కు వచ్చా. పత్తిని ఎక్కడ విక్రయించాలా అనే ఆలోచనలో ఉండగా నేడు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో పత్తి మార్కెట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. వరి మంచి గిట్టుబాటే దక్కుతున్నందున పత్తి కూడా ఇక్కడకే తెచ్చి అమ్ముకుంటా. ఇక్కడ విక్రయిస్తే నాకు రవాణా ఖర్చులు మిగులుతాయి.
– దొంగరి వెంకటేశ్వర్లు, వెంకట్రాంపురం గ్రామం