నీలగిరి, నవంబర్ 17: నల్లగొండ పట్టణంలో ఒకే రోజు లక్ష మొక్కలు నాటి పట్టణ పచ్చదనంతో విరజిల్లేలా చూడాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ రాకేశ్ మోహన్ డోబ్రియిల్ సూచించారు. నల్లగొండ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో గురువారం ఫారెస్టు అధికారి శివానీ డోగ్రా, కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డిలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాకేశ్ మోహన్ మాట్లాడుతూ నల్లగొండ పట్టణం చాలా వరకు డ్రైఉందని, దీన్ని పచ్చదనంతో కళకళలాడేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈనెల 19న జిల్లా యంత్రాంగం సంకల్పించిన 1,04,500 మొక్కలు నాటే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలన్నారు. పట్టణ శివారు ప్రాంతాలకన్నా నివాసాల నడుమ మొక్కలు అత్యధికంగా నాటేలా ప్రణాళిక తయారు చేయాలన్నారు. అవసరమైతే వార్డు అధికారులు, కౌన్సిలర్ల సహకారం తీసుకోవాలన్నారు. పెద్ద మొక్కలు నాటేటప్పుడు రెండు నుంచి మూడు ఫీట్ల మట్టిని తీసి నాటాలన్నారు. వాటి మధ్య మూడు మీటర్లు వ్యతాసం ఉండాల ని వాటి మధ్యలో చిన్నమొక్కలు నాటాలన్నారు.
ట్రీగార్డును ఏర్పాటు చేయాలి
నాటిని ప్రతి మొక్కకు ట్రీగార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. చెట్టు తనంతట తానే స్వతహాగా పెరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి మట్లాడుతూ పట్టణంలో పది ప్రాంతాల్లో 18 టీమ్లను ఏర్పాటు చేసి ఈకార్యక్రమం విజయవంతం చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి, జిల్లా ఫారెస్టు అధికారి రాంబాబు, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి కోటేశ్వర్రావు, డీఈఓ భిక్షపతి, ఉద్యానవన అధికారి సంగీతలక్ష్మి పాల్గొన్నారు.