భువనగిరి అర్బన్, నవంబర్ 17 : పువ్వు పార్టీలో పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏడాది జూలై 26న భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో జరిగిన బండి సంజయ్ సన్నాహక సమావేశంలో ఆ పార్టీ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని స్టేజీపైకి ఆహ్వానించలేదు. తాజాగా అదే హోటల్లో గురువారం నిర్వహించిన లోకసభ ప్రవాస్ యోజనకోర్ కమిటీ సమావేశంలోనూ జిట్టా బాలకృష్ణారెడ్డిని స్టేజీపైకి పిలువలేదు. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు, రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి గైర్హాజరయ్యారు. సమావేశానికి కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీ హాజరుకాగా బీజేపీలో ఇటీవల చేరిన బూర నర్సయ్యగౌడ్‌ను స్టేజీపైకి ఆహ్వానించారు. కానీ ఆయన కంటే ముందు బీజేపీలో చేరిన జిట్టాను ఆహ్వానించకపోవడంతో బీజేపీలో గ్రూపుల విభేదాలు బయటపడ్డాయి. కేంద్ర మంత్రి ప్రత్యేక ప్రెస్‌మీట్ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డిని స్టేజీపైకి పిలువడంతో ఆయన అసహనం వ్యక్తం చేస్తూ సాధారణ కార్యకర్తలతో కలిసి కిందున్న కుర్చీలోనే కూర్చున్నాడు. రెండోసారి స్టేజీపైకీ రావాలని బలవంతంగా పిలువడంతో మొహమాటంగా తప్పదన్నట్టు బాలకృష్ణారెడ్డి స్టేజీపైన చివరగా కూర్చున్నాడు.
భువనగిరి పట్టణంలో కేంద్రమంత్రి సమావే శానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్ రావు, రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి గైర్హాజరయ్యారు. ప్రస్తుతం బీజేపీలో చేరిన బూర నర్సయ్య అన్ని పగ్గాలు అప్పగిస్తున్నారనే కోణంలో నాయకులు గైర్హాజరై ఉండవచ్చని జిల్లా నాయకులు చర్చించుకుంటున్నారు.
జిల్లాలో బీజేపీ నాయకులు పాత, కొత్త పంచాయతీలతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటున్నారు. జిల్లాలో పెద్ద క్యాడర్‌లేని బీజేపీలో నలుగురు చేరడంతో నాలుగు గ్రూపులుగా ఏర్పడ్డాయి. పార్టీలో ముందు నుంచి పీవీ శ్యామ్‌సుందర్‌రావు పనిచేస్తుండగా కాంగ్రెస్ నుంచి చేరిన గూడూరు నారాయణరెడ్డి మధ్య వ్యత్యాసాలు రావడంతో దూరమయ్యారు. తర్వాత చేరిన యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డితో పీవీ. శ్యామ్‌సుందర్‌రావు మధ్య కూడా విభేదాలు వచ్చాయి. వారు సమావేశాలకు హాజరైనా స్టేజీలపైకి పిలువకపోవడంతో గ్రూపు రాజకీయాలు తయారయ్యాయి. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సాక్షిగానే విబేధాలు బయటపడడంతో ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో పడుతున్నారు.