చదువులో వెనుకబడిన విద్యార్థుల సామర్థ్యాల పెంపుపై విద్యాశాఖ దృష్టి సారించింది. కరోనా సమయంలో స్కూళ్లు నడువక చాలామంది విద్యార్థులు విద్యలో వెనుకబడి నష్టపోయారు. అటువంటి విద్యార్థులు తమ సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు విద్యాశాఖ వాట్సాప్ ఆధారిత ఇంటింటా చదువుల పంట కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. విద్యార్థ్ధులు ఎప్పటికప్పుడు పాఠ్యాంశాలపై పట్టు పెంచుకొని మంచి ఫలితాలు సాధించడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
– నేరేడుచర్ల, నవంబర్ 17
విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను ప్రధానోపాధ్యాయులు వాట్సాప్ గ్రూప్‌లో నమోదు చేస్తారు. ప్రతి శనివారం ఆయా పాఠ్యాంశాలపై రూపొందించిన ప్రశ్నల లింక్‌ను సదరు గ్రూప్‌లో పొందుపరుస్తారు. 3నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రతి శనివారం పాఠ్యాంశాల వారీగా ప్రశ్నలను వాట్సాప్ ద్వారా పంపుతారు. గణితం, ఇంగ్లిష్, సైన్స్, సాంఘిక శాస్ర్తాలకు సంబంధించి ఎనిమిది నుంచి పది ప్రశ్నలు పంపిస్తారు. విద్యార్థులు వాటిని వారంలోపు అంటే శుక్రవారంలోగా పూర్తి చేసేలా ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తారు. మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో డ్యాష్ బోర్డు ద్వారా అధికారులు సమన్వయం చేస్తారు. దీనిపై ప్రతి విద్యార్థి ఇంటి వద్ద సాధన చేసే విధంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు.
ఉపాధ్యాయులు రూపొందించిన వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన లింక్‌ను ఓపెన్ చేయాలి. పాఠశాల పేరు గుర్తించి దానిపై నొక్కగానే వచ్చే పేరు, తరగతి, సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ వెంటనే ప్రశ్నలు కనిపిస్తాయి. వాటికి సమాధానాలు రాయగానే.. సరిగ్గా ఎన్ని రాశారో సందేశం వస్తుంది. సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు సూచనలు ఇస్తుంది. ప్రశ్నలకు తప్పు సమాధానం రాస్తే వెంటనే సరి చేస్తుంది. విద్యార్థికి అర్థమయ్యేలా వీడియోల రూపంలో సమాధానం ఉంటుంది. దీన్ని మొబైల్లో చూడవచ్చు. విద్యార్థులు క్రమం తప్పకుండా పరీక్ష రాసేలా ఉపాధ్యాయులు చొరవ చూపాల్సి ఉంటుంది. వాట్సాప్ వారాంతపు పరీక్ష ద్వారా పిల్లల సామర్థ్యాలను స్వీయ మదింపు సరిచేసే ప్రయత్నం చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటింటా చదువుల పంట కార్యక్రమం విద్యార్థుల ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుంది. విషయం, పరిజ్ఞానంపై మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ నంబర్ల నమోదును పూర్తి చేశాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు విద్యార్థులందరి వివరాలను నిక్షిప్తం చేశాం. దీని వల్ల పిల్లల చదువు ఎలా ఉందో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిందడ్రులకు తెలుస్తుంది.
– చత్రూనాయక్, నేరేడుచర్ల ఎంఈఓ