యాదాద్రి, నవంబర్17 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. గురువారం తెల్లవారుజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతు జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో కల్యాణతంతును వీక్షించారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన నిర్వహించారు.
బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ వైభవంగా చేపట్టారు. రాత్రి స్వామివారికి తిరువరాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిపారు. ప్రధానాలయంతోపాటు అనుబంధ రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్టలో కార్తికమాస వేడుకలు విశేషంగా జరిగాయి. భక్తులు వేకువజామునే కొండపైన దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
సత్యనారాయణ స్వామి వ్రత మండపం సందడిగా మారింది. యాదాద్రి కొండ కింద నూతన వ్రత మండపం, పాతగుట్టలో సత్యనారాయణ వ్రతాలు వైభవంగా జరిగాయి. 501 మంది దంపతులు వ్రతమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాల వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో దీపారాధన చేపట్టారు.
స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 22 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ.27,83,363 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 2,18,950
వీఐపీ దర్శనాలు 60,000
బ్రేక్ దర్శనం 1,69,800
వేద ఆశీర్వచనం 11,400
నిత్య కైంకర్యాలు 1,300
ప్రచార శాఖ 6,440
వ్రత పూజలు 4,00,800
కల్యాణకట్ట టిక్కెట్లు 45,100
ప్రసాద విక్రయం 9,63,800
వాహన పూజలు 4,900
అన్నదాన విరాళం 28,853
సువర్ణ పుష్పార్చన 1,18,513
యాదరుషి నిలయం 53,984
పాతగుట్ట నుంచి 43,420
కొండపైకి వాహన ప్రవేశం 2,50,000
శివాలయం 10,300
శాశ్వతపూజలు 30,000
లీజులు 3,03,840