కేంద్ర ప్రభుత్వ పాపం నిత్యం సామాన్యుల ప్రాణాలు తీస్తున్నది. జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారి ప్రయాణికుల పాలిట మృత్యు రహదారిగా మారింది. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతుండడంతో వందలాది ప్రాణాలు కోల్పోతున్నారు.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి నిత్యం నెత్తురోడుతున్నది. ఏదో ఒక చోట యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. వందలమంది ప్రాణాలు పోగొట్టుకుంటుండగా వేల మంది క్షతగాత్రులై జీవచ్ఛవాలుగా మారుతున్నారు. దీనంతటికీ నేషనల్ హైవే అథారిటీ నిర్వహణ లోపమే కారణం. 65వ నంబర్ జాతీయ రహదారిపై అవసరమున్న చోట్ల సర్వీసు రోడ్లు, అండర్‌పాస్‌లు నిర్మించలేదు. మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు కనిపించవు. చౌరస్తాలో వేగ నియంత్రణ చర్యలు, సిగ్నల్ వ్యవస్థ కరువయ్యాయి. దాంతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.
సూర్యాపేట జిల్లా పరిధిలో హైవేపై ఐదేండ్లలో 767 ప్రమాదాలు జరగ్గా, 368 మంది మృత్యువాత పడ్డారు. వందలాది మంది గాయాలపాలై దివ్యాంగులుగా మారారు. అత్యధికంగా మునగాల మండలంలో 128 మంది, చివ్వెంల మండలంలో 88 మంది చనిపోయారు. చౌటుప్పల్, చిట్యాల, కట్టంగూర్, నకిరేకల్ మండలాల పరిధిలోనూ ఇదే పరిస్థితి. ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఎంపీలు పలుమార్లు కేంద్ర మంత్రికి విన్నవించినాపట్టించుకోలేదు. ఇటీవల మునగాలలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు చనిపోవడంతో హైవే నిర్వహణ నిర్లక్ష్యం మరోమారు స్పష్టమైంది.
– సూర్యాపేట, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, నవంబర్ 16(నమస్తే తెలంగాణ) : హైవే నిర్మాణ సమయంలోనే అనేక ఉద్యమాలు, నిరసనలు జరిగాయి. జనం సొమ్ముతో నిర్మించే రహదారి ప్రజల సౌకర్యార్థం ఉండాలని సూర్యాపేట, కోదాడతో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. వాస్తవానికి పట్టణాలు, గ్రామాలు, నివాస ప్రాంతాల మీదుగా హైవే వెళ్తే కచ్చితంగా ైప్లెఓవర్లు లేదా సర్వీసు రోడ్లు ఉండాలి. కానీ జిల్లాలో చాలా చోట్ల ఈ రెండూ లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. దాంతో వందలాది మంది మృత్యువాత పడడం, అంతకు పది రెట్లు దివ్యాంగులుగా మారుతున్నారు.
స్టాపర్లు, బొల్లర్స్ ఏవి..?
జాతీయరహదారుల నిర్మాణం జాగ్రత్తలతో చేపట్టాలి. కానీ కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టాయి. రోడ్డు నిర్మాణానికి ముందే పూర్తిగా సర్వే చేసి ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. జంక్షన్ల వద్ద సరిపడా ట్రాఫిక్ సిగ్నల్స్, పెద్ద ఎత్తున లైటింగ్ ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తిస్తే అక్కడ స్పష్టంగా కనిపించేలా సూచికలు, ఎల్లో కలర్‌తో స్టాపర్లు, బొల్లర్స్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ జిల్లాలోని మునగాల, చివ్వెంల మండలాలతో పాటు ఇతర అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం, పట్టించుకోకపోవడంతో కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్లక్ష్యంగా ఉంటున్నాయి.
అసంపూర్తిగా సర్వీస్ రోడ్డు నిర్మాణం
కట్టంగూర్: జాతీయ రహదారుల నిర్మాణాల్లో భాగంగా కట్టంగూర్‌లో సర్వీస్ రోడ్డు కురుమర్తి క్రాస్ రోడ్డు వరకు నిర్మించాల్సి ఉన్నా హైవే అధికారులు మాత్రం బస్టాండ్ వరకు నిర్మించి చేతులు దులుపుకొన్నారు. దాంతో ఇందిరమ్మ, పద్మశాలి కాలనీల నుంచి వాహన దారులు, ప్రజలు మండల కేంద్రానికి రాంగ్ రూట్లో వస్తుండడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాగే కురుమర్తి నుంచి కట్టంగూర్, నల్లగొండకు వెళ్లే వాహనాలు సర్వీస్ రోడ్డు లేకపోవడంతో రాంగ్రూట్లో వెళ్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
వినతులకు కనీస గౌరవం లేదా..?
హైవేపై ప్రమాదాల నివారణకు మంత్రులు, ఎంపీలతో పాటు సాధారణ జనం ఎన్ని వినతులు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం వాటికి కనీస గౌరవం ఇవ్వకపోవడం. వాటిని చెత్తబుట్టలో వేస్తుండడంతో ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎనిమిదేండ్లలో కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ నుంచి ఇప్పటి వరకు ప్రమాదాల నివారణ కోసం సర్వీసు రోడ్ల నిర్మాణాలు, అండర్ పాస్ నిర్మించాలని అనేక సార్లు లేఖలు రాసినా ఫలితం లేదు. కేంద్రం నిర్లక్ష్యంగా ఉంటుండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నది.
సూర్యాపేట జిల్లాలో 2018-2022 (అక్టోబర్) వరకు జాతీయరహదారి 65పై జరిగిన ప్రమాదాల వివరాలు
బ్లాక్ స్పాట్లు గుర్తించి చర్యలు చేపడుతున్నాం జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపడుతున్నాము. బ్లాక్ స్పాట్లు గుర్తించి ఆ ప్రాంతాల్లో ఏ సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తించి ఆ సమయాల్లో వాహన తనిఖీలు చేపడుతున్నాము. అలాగే బారికేడ్లు పెట్టిస్తున్నాం. సర్వీసు రోడ్లు ఉంటే ప్రమాదాలు జరుగవు. ప్రయాణాల సమయాల్లో కాస్త దూరం ఉన్నా సరైన మార్గంలో వెళ్లి యూటర్న్ తీసుకోవాలి తప్ప ఎదురెళ్లి కోరి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు.
-రాజేంద్రప్రసాద్, ఎస్పీ, సూర్యాపేట జిల్లా
రోడ్డునపడుతున్న కుటుంబాలు
జాతీయరహదారి ప్రమాదంలో బాధిత కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతున్నది. వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, రైతు బీమాతో పాటు ఇతరత్రా అనేక రకాలుగా ఆదుకుంటుండడంతో కొంత ఆసరా లభిస్తున్నప్పటికీ బాధితులకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. సూర్యాపేట జిల్లాలో గత ఐదేండ్లుగా పరిశీలిస్తే 767 ప్రమాదాలు జరగ్గా 368 మృతి చెందారు. వెయ్యికి పైనే మందికి గాయాలయ్యాయి. అత్యధికంగా మునగాల మండలంలో 128 మంది, చివ్వెంల మండలంలో 88 మంది మృతి చెందారు. సూర్యాపేట మండలంలో 49, సూర్యాపేట టౌన్ లో 37, కోదాడ రూరల్‌లో 34, కోదాడ టౌన్లో 32 మంది ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు.
కొడుకు, మనువడిని కోల్పోయిన వెంకన్న
మునగాల : సవ్యంగా సాగుతున్న జీవితాన్ని అనుకోని ఘటనలు ఛిన్నాభిన్నం చేస్తాయి. అలాంటి పరిస్థితే మండల కేంద్రానికి చెందిన వల్లోజు వెంకన్న, వీరభద్రమ్మ దంపతులది. వీరిది నిరుపేద కుటుంబం. వీరికి నాగరాజు, సునీత, స్వాతి ముగ్గురు సంతానం. నాగరాజు వివాహమైంది. ఆయనకు మణికంఠ 7నెలల కుమారుడు ఉన్నాడు.
నాగరాజు మండల కేంద్రంలో పండ్లదుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో నాగరాజు బైక్‌పై భార్య, కొడుకు మణికంఠతో మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి వెళ్తుండగా 65వ జాతీయ రహదారిపై కారు ఢీ కొట్టడంతో నాగరాజు, మణికంఠ చనిపోయారు. చేతికి అందిన కొడుకు, మనవడిని కోల్పోయి వెంకన్న మానసికంగా కుంగిపోయాడు. ప్రస్తుతం కొడుకు పెట్టిన పండ్ల దుకాణం ఆయనకు జీవనాధారమైంది.
రోడ్డు ప్రమాదంలో అమ్మను కోల్పోయా ..
65వ నంబర్ జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్లు, అండర్‌పాసులు లేకపోవడంతో రహదారి పక్కనున్న గ్రామాలకు వెళ్లే ప్రజలు ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. మా అమ్మ కూలి పనులకు వెళ్లి తిరిగి ఆటోలో ఇంటికి వస్తుండగా హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా రహదారి వెంట సర్వీస్ రోడ్లు, అండర్‌పాసులు నిర్మించాలి.
– జెర్రిపోతుల భిక్షం, పిల్లలమర్రి, (సూర్యాపేట రూరల్)
చేతికందిన కొడుకు దూరమయ్యాడు
నాలుగు నెలల క్రితం ఒక్కగానొక్క కొడుకు మీసాల వంశీ (21) రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడునుకున్న కుమారుడు ఇప్పుడు లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రైవేటు దవాఖానలో డ్యూటీ అయి పోవడంతో ఇంటికి వస్తుండగా కాసింపేట వద్ద జాతీయ రహదారి 65 పై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయలై మృతిచెందాడు. సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల చనిపోయాడు.
– మీసాల లక్ష్మి ,ఉండ్రుగొండ (చివ్వెంల)