దేశంలో గుర్తింపు ఉండాలన్నా, ప్రభుత్వ, ప్రైవేట్ నుంచి సహకారాలు అందాలన్నా ఆధార్ కార్డు
తప్పనిసరైంది. ప్రతిఒక్కరూ పదేండ్లకోసారి కార్డును అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఐదేండ్లు దాటిన పిల్లల వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్ నంబర్ తదితర వాటిని మార్పు చేసుకోవచ్చు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆధార్ అప్డేట్ ప్రక్రియను విద్యాశాఖ అధికారులు పెటారు. పాఠశాలల విద్యార్థులు మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ కార్యాలయంలోనూ ఏర్పాట్లు చేశారు.
– మునుగోడు, నవంబర్16
మునుగోడు, నవంబర్16 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల ఫలాలు పొందాలన్నా, బ్యాంక్ ఖాతా తెరువాలన్నా, ఇన్కం ట్యాక్స్ కట్టాలన్నా, భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా.. ఇలా ప్రతి దానికీ ఆధార్ తప్పనిసరి. కానీ, ప్రస్తుతం ఉన్న చాలా ఆధార్ కార్డులలో వివరాలు సరిగా లేవని భావించిన కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి వ్యక్తీ పదేండ్లకోసారి ఆధార్ వివరాలు నవీకరణ(అప్డేట్) చేసుకొవాలని సూచించింది. ఇందుకు ఆధార్ నిబంధనలను కూడా కేంద్రం సవరించింది.
ఈ నేపథ్యంలో జిల్లాలో విద్యార్థుల ఆధార్ నవీకరణకు చర్యలు చేపట్టారు. మొత్తం 34 లక్షలకు పైగా ఆధార్ కార్డులు ఉండగా, ఇందులో ఐదేండ్ల వయసు నిండిన తర్వాత చిన్నారుల వేలిముద్రలు, ఫొటోను నవీకరణ చేయాల్సి ఉంటుంది. అవగాహన లేక చాలా మంది ఆధార్ కార్డులు నవీకరణ చేయించుకోవడం లేదని, ఈ కారణంగా కార్డు రద్దవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2016 మార్చికి ముందు ఆధార్ కార్డు పొందినవారు మరోసారి తప్పులుంటే సరి చేసుకొవాలని, మారిన వివరాలతో నవీకరించుకోవాలని జిల్లా సంబంధిత శాఖ అధికారులు ప్రజలకు ఆవగాహన కల్పించారు. పేరు, పుట్టిన తేదీలో తప్పులు ఉన్నా, చిరునామా, ఫోన్ నంబర్ మారినా వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
హాస్టల్ విద్యార్థుల నుంచి శ్రీకారం..
వసతి గృహాల్లోని విద్యార్థుల ఆధార్ అప్డేట్ను అధికారులు తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల వసతిగృహాల విద్యార్థులకు జిల్లా మీ సేవల ఏఓ రాజశేఖర్, డీఎం కత్తుల గౌతమ్ పర్యవేక్షణలో ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ కార్యక్రమం జరుగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 46 వసతి గృహాలు ఉండగా, ఇందులో 18 బాలకలవి, 28 బాలురవి ఉన్నాయి. వీటిల్లో 2,821మంది విద్యార్థులు ఉన్నారు. ఈ కార్యక్రమం జిల్లాలో శనివారం ప్రారంభం కాగా, ఆదివారం సెలవు దినం కావడంతో ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 500 మందికి పైగా విద్యార్థుల బయోమెట్రిక్ నవీకరించారు. మిగిలిన వారి అప్డేట్ కార్యక్రమం వసతి గృహాల్లో కొనసాగుతున్నది.
పాఠశాలల్లో అనుసంధానం..
జిల్లాలో పాఠశాల విద్యార్థుల పూర్తి వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నిక్షిప్తం చేసేందుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను విద్యాశాఖ పర్యవేక్షిస్తున్నది. దీని ద్వారా ఏ విద్యార్థి ఎక్కడ? ఏ తరగతి చదువుతున్నాడనే సమాచారం తెలియనున్నది. జిల్లాలోని 1,950 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 1.70లక్షల మందికి ఆధార్ అప్డేట్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అనుసంధాన ప్రకియ వేగంగా పూర్తి చేసేలా విద్యాశాఖ అధికారులు ఎమ్మార్సీల్లో ఆధార్ కేంద్రాన్ని అందుబాటులో ఉంచారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.