కృష్ణవేణి పరవళ్లు, తొణికిసలాడుతున్న నీటి వనరులతో పాతాళ గంగ ఏటేకేడు పైపైకిఉబికి వస్తున్నది. నల్లగొండ జిల్లాలో గతేడాది సగటు జల భూగర్భ జల లభ్యత 4.17 మీటర్ల లోతులో ఉండగా, ఈసారి మరో 3.41 మీటర్లలోనే ఉంటున్నది. కృష్ణపట్టె అయిన దామరచర్ల మండలంలో 0.63 మీటర్లు, కరువు ప్రాంతమైన దేవరకొండ నియోజక వర్గంలోని గుండ్లపల్లిలో 0.67 మీటర్ల లోతులోనే లభిస్తుండడం విశేషం. కిందటేడు దామరచర్లలో 1.18 మీటర్లు, గుండ్లపల్లిలో 3.62 మీటర్లలో ఉండగా, గణనీయంగా ఉబికి రావడం గమనార్హం. ఏటా సమృద్ధిగా వర్షాలు పడుతుండడం, నాగార్జునసాగర్ నిండుకుండలా కళకళలాడుతుండడం కలిసివస్తున్నట్లు అధికార యంత్రాంగం చెప్తున్నది. భూగర్భ జలాల పెంపుతో రైతాంగంలో సంతోషం వ్యక్తమవుతున్నది.
– నల్లగొండ, నవంబర్ 16
నల్లగొండ, నవంబర్ 16 : జిల్లా వ్యాప్తంగా సగటున 3.41 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉండగా.. దామరచర్ల, గుండ్లపల్లి మండలాల్లో అర మీటర్ లోతులోనే ఉన్నాయి. దామరచర్ల మండలంలో 0.63 మీటర్ల లోతులోనే నీటి లభ్యత ఉండగా కరువు ప్రాంతమైన గుండ్లపల్లి మండలంలో 0.67 మీటర్లలోనే భూగర్భ జలాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 32 మండలాలు ఉండగా చందంపేట(7.95 మీటర్లు), చిట్యాల (6.27మీటర్లు), నేరేడుగొమ్ము (6.23 మీటర్లు), చండూరు(5.93 మీటర్లు) మినహాయిస్తే మిగిలిన 28 మండలాల్లో ఐదు మీటర్ల లోపే భూగర్భ జలాలు ఉన్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది జిల్లాలో సగటున 0.75 మీటర్ల మేర భూగర్భ జలం పైకి ఉబికి వచ్చింది.
సమృద్ధిగా వర్షాలు కురువడంతో..
జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సమృద్ధ్దిగా వర్షాలు కురువడంతో భూగర్భజలాలు ఏటికేడు పెరుగుతున్నాయి. ఏడెనిమిదేండ్ల క్రితం తక్కువగా 6-8 మీటర్ల నుంచి గరిష్ఠ స్థాయిలో 25-30 మీటర్ల వరకు భూగర్భ జలాలు ఉండేవి. ప్రస్తుతం అర మీటరులోతునే ఉబికి రాగా గరిష్ఠంగా ఎనిమిది మీటర్ల లోపే ఉన్నాయి. హరితహారం పథకం కింద ప్రతి ఏడాది సుమారు కోటి దాక మొక్కలు నాటుతుండడంతో అవి పెరిగి చల్లటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. చెట్లు వర్షాలకు ఊతమిస్తున్న నేపథ్యంలో ప్రతి ఏటా జిల్లాలో సాధారణానికి మించిన వర్షం కురుస్తున్నది. ఈ ఏడాది కూడా 635.0 మిల్లీమీటర్ల వర్షం కురువాల్సి ఉం డగా 750.4 మిల్లీమీటర్లు కురవగా 18.2శాతం అదనంగా నమోదైంది.
సాగర్ జలాల సద్వినియోగంతో..
నాగార్జునసాగర్ నుంచి ప్రతి ఏటా నీటి కేటాయింపును ప్రభుత్వం సద్వినియోగం చేస్తూ కాల్వల ద్వారా నీటిని కిందికి విడుదల చేస్తున్నది. వాటితో చెరువులను సైతం నింపుతుండటంతో నదీ జలాలు కూడా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రైతులు, పశు పక్ష్యాదులకు నీటి కరువు లేకుండా పోతున్నది.
భూగర్భ జలాలు భారీగా పెరుగుతున్నాయి..
ప్రతి ఏటా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో పాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కూడా సక్రమంగా జరుగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా భూగర్భజలాలు పెరుగుతు న్నట్లు తెలుస్తున్నది. గత ఏడాది కంటే ఈ సారి భూగర్భ జలాలు 0.75 మీటర్లపైకి వచ్చాయి. దామరచర్ల, గుండ్లపల్లిలో మీటర్ లోపలే నీరు ఉన్నది. మిగతా ప్రాంతాల్లోనూ పైకి వచ్చినట్లు తెలుస్తున్నది.
– సునీల్‌బాబు, డీడీ భూగర్భ జలవనరుల శాఖ అధికారి, నల్లగొండ జిల్లా