చేతిలో కళ ఉన్నా చెయ్యడానికి పని లేక అరిగోస తీసిన చేనేత రంగాన్ని ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకున్న పాలకులు లేరు. నేత కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలకూ చలించలేదు. ఉన్న ఒకటీ రెండు పథకాలనూ నీరుగార్చారు. స్వరాష్ట్రంలో సర్కారు ఆసరా అవ్వడంతో మగ్గాలకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది. చేనేత పొదుపు, నూలు, రంగులు, రసాయనాలపై 40 శాతం సబ్సిడీ, విద్యుత్‌పై 50 శాతం రాయితీతో అండగా నిలిచిన ప్రభుత్వం.. తాజాగా బీమాతో కొండంత ధీమాను ఇస్తున్నది. 60 ఏండ్లలోపు చేనేత, మరమగ్గాల కార్మికులు ఏ కారణంతో వారి కుటుంబానికి 5 లక్షల బీమాను అందిస్తున్నది. అందుకు అవసరమయ్యే ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నది. అలా ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇటీవల ఐదుగురికి రూ.5లక్షల చొప్పున బీమా సాయం అందింది.
నేత కార్మికులకు ఇప్పటికే ఎంతో చేయూతనిచ్చిన రాష్ట్ర సర్కారు మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నది. రైతు బీమా లెక్క నేత కార్మికులకు కూడా నేతన్న బీమా పథకానికి నాంది పలికింది. ఈ స్కీమ్‌ను ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి కేకలతో ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలను ఏ ఒక్క సర్కారు కూడా ఆదుకోలేదు. ఉన్న ఒకటీ రెండు స్కీమ్‌లను కూడా పట్టించుకోలేదు. కానీ.. స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పొదుపు పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కార్మికుడు నెలకు కొంత మేర చెల్లిస్తే దానికి రెండింతలు సర్కారు కడుతుంది. ఇక నూలు, రంగులు, రసాయనాలపై 40శాతం సబ్సిడీ అందిస్తున్నది. విద్యుత్‌పై 50శాతం సబ్సిడీతో నేత కార్మికుల ఇన్పుట్ ఖర్చును తగ్గించింది.
– యాదాద్రి భువనగిరి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ)
రైతుబీమా తరహాలోనే ప్రభుత్వం నేత కార్మికులకు రూ.5లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నది. రైతు బీమా పథకం కింద గుంట భూమి ఉన్న రైతు మరణించినా బాధిత కుటుంబానికి రూ.5లక్షలు అందిస్తున్నది. ఈ పథకానికి రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తున్నది. ఇదే తరహాలో నేత కార్మికలకు సైతం బీమా పథకాన్ని తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేస్తున్నది. దీని ప్రకారం ఎవరైనా, ఏ కారణంతోనైనా చనిపోతే వారి కుటుంబాలకు పరిహారం అదిస్తున్నది. చనిపోయిన పది రోజుల్లో మొత్తం అమౌంట్ నామినీ అకౌంట్లో జమ చేస్తున్నది. ఇటీవల ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురికి రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఐదు కుటుంబాలకు బీమా డబ్బు అందింది. నేతన్న బీమా కోసం ఎల్ఐసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వార్షిక ప్రీమియం కోసం కార్మికుడు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఈ పథకానికి 60 ఏండ్లలోపు చేనేత, మరమగ్గాల నేత కార్మికులందరూ అర్హులుగా నిర్ణయించింది.
చేనేత రంగానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేయకపోగా.. ఆ రంగం నడ్డి విరుస్తున్నది. చేనేతపై పన్ను వేసి మగ్గానికి మరణ శాసనం రాస్తున్నది. 5శాతం జీఎస్టీ విధించడమే కాకుండా.. దానిని 12 శాతానికి పెంచాలని యోచిస్తున్నది. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఇదివరకు ఉన్న సీములన్నింటినీ ఎత్తేసింది. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దుతోపాటు ఆలిండియా హాండీక్రాఫ్ట్ బోర్డు, మహాత్మాగాంధీ బున్కర్ బీమా యోజన, లాంబార్డ్ బీమా, హౌజ్ కం షెడ్ సీమ్, థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని రద్దు చేసి చేనేత కళాకారులను ఆ వృత్తికి దూరం చేస్తున్నది.
మాది నిరుపేద చేనేత కుటుంబం. మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నం. నా భర్త పాపని వెంకటేశ్వర్లుకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించగా.. అక్టోబర్ 23న మరణించాడు. దవాఖాన ఖర్చులు రూ.4లక్షల దాకా అయ్యాయి. చేనేత బీమా పథకం ద్వారా దశదిన కర్మలోపే రూ.5లక్షల సాయం అందింది. అందులోంచి నాలుగు లక్షలు ఆస్పత్రి ఖర్చులకు చెల్లించాం. మిగిలిన లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. సీఎం కేసీఆర్ చలువతోనే రూ.5లక్షల సాయం దక్కింది. ఇలాంటి పథకం మాలాంటి పేదలకు ఎంతో ఉపయోపడుతుంది.
– పాపని నిర్మల, కక్కిరేణి, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
మాది రెక్కాడితేగానీ డొక్కాడని పేద చేనేత కుటుంబం. మా తల్లిదండ్రులు చేనేత కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. మా నాన్న రెండేండ్ల క్రితం చనిపోగా.. మా అమ్మ సులోచన చేనేత కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా పోషణను నెట్టుకొస్తుండేది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మా అమ్మ చనిపోయింది. దిక్కుతోచని స్థితికి చేరుకున్న మా కుటుంబానికి చేనేత బీమా పథకం కొండంత అండగా నిలిచింది. అమ్మ చనిపోయిన 10 రోజులకే నా పేరు మీద బ్యాంకు ఖాతాలో రూ.5లక్షలు జమ అయ్యాయి. సీఎం కేసీఆర్ సాయం మరువలేనిది.
– బోగ మహేశ్, రఘునాథపురం, రాజాపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణలో నేత కార్మికుల కోసం నేతన్న బీమా పథకం తేవడం ఎంతో సంతోషకరం. గతంలో ఉన్న ప్రభుత్వాలు కనీసం పట్టించుకున్న పాపానపోలేదు. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. ఈ పథకంతో అందుతున్న రూ.5లక్షలు కుటుంబానికి ఎంతో ఆసరా అవుతున్నది. కేంద్రం మాత్రం చేనేతపై జీఎస్టీ పేరుతో కార్మికులను రోడ్డుకీడుస్తున్నది. నేతన్న బీమా పథకం దేశమంతా అమలు చేయాలి.
– అవ్వారి భాస్కర్, తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
మొదటి నుంచి మేం సాంచాలు నడిపే బతుకున్నం. ఈ మధ్య మా ఆయన బడుగు పుల్లయ్య ఆరోగ్యం బాగలేక ప్రైవేట్ దవాఖానలో చనిపోయిండు. వైద్యానికి కూడా చేతిలో డబ్బులు లేకుండే. నేతన్న బీమా కింద ప్రభుత్వం 5 లక్షలరూపాయలు అకౌంట్లో వేసింది. వాటితోనే ఆస్పత్రి బిల్లు కట్టినం. ఆ డబ్బుతో అప్పులోళ్ల దగ్గర మాట దక్కింది. కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటం.
– బడుగు పద్మ, సిరిపురం, రామన్నపేట మండలం