హాలియా, నవంబర్ 14 : గత రెండేండ్లుగా పత్తి సాగు చేస్తున్న రైతులపై ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. పూత దశలో, పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు కురుస్తుండటంతో పత్తి రైతు చిత్తయిపోతున్నాడు. దిగుబడి బాగా వచ్చి సిరులు కురిపిస్తుందనుకునే రైతులకు అక్కడికక్కడికే సరిపోతుండటంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దిగుబడి తగ్గినా ప్రస్తుతం మార్కెట్లో క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.8,500 పలుకుతుండడం రైతులకు కాస్త ఊరట కల్పిస్తుంది. సాగర్ నియోజకవర్గంలో 1.20 లక్షల ఎకరాల్లో సాగు
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఈ ఏడాది 52,367 మంది రైతులు 1.20 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అనుముల మండలంలో 13,677, గుర్రంపోడు 46,599, నిడమనూరు4,514 పెద్దవూర 30,247, తిరుమలగిరి సాగర్24,402, త్రిపురారం 700 ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
గత రెండేండ్లుగా పత్తి రైతులకు కలిసి రావడం లేదు. ఒకవైపు నాసిరకం విత్తనాలు, మరోవైపు వర్షం పత్తి రైతును చిత్తు చేస్తున్నాయి. దాంతో ఈ ఏడాది నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా పత్తి దిగుబడి ఘననీయంగా తగ్గింది. గతంలో ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల మేర దిగుబడి రాగా, గత సంవత్సరం, ఈ ఏడాది మాత్రం ఎకరానికి 3 నుంచి 5 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు.
ఈ ఏడాది పెరిగిన ధర పత్తి రైతుకు కలిసొచ్చింది. దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం మార్కెట్లో పత్తి ధర అమాంతం పెరిగింది. క్వింటాకు మేలురకం అయితే రూ.8,500, నాసిరకం అయితే రూ.8000 పలుకుతుంది. పంట దిగుబడి తగ్గినప్పటికీ పెరిగిన పత్తి ధర రైతులను నష్టాల ఊబిలో కూరుకుపోకుండా కాపాడుతుంది.
వాతావరణంలో మార్పులకు అనుగుణంగా రైతులు పత్తి సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడే అధిక దిగుబడి వస్తుంది. తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల, రొంటాల తదితర ప్రాంతాలకు వెళ్లి రైతులు నాసిరకం విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అది పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. రైతులు మేలు రకం విత్తనాలతోపాటు వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా పంట సాగు చేయాలి.
-రవీందర్, ఏడీఏ, హాలియా
ఈ ఏడాది 3 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. పంట దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. వాతావరణ పరిస్థితులతో దిగుబడి తగ్గింది. క్వింటాకు రూ.7,500 చొప్పున ఇప్పటికే 15 క్వింటాళ్లు అమ్మాను.
-గాలి గోవిందరెడ్డి, రైతు, బట్టుగూడెం, పెద్దవూర