అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆరుగాలం కష్టించే అన్నదాతలపై మోయలేని భారం పడుతున్నది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగడంతో డీజిల్ ధరల ప్రభావం రైతులపై నేరుగా పడుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, సాగునీరు, ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులకు అండగా నిలుస్తుంటే.. కేంద్రం ధరల భారం మోపి వారి నడ్డి విరుస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి.. డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలంలో 1.86 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యింది. ఇప్పటికే 40 శాతం వరి కోతలు పూర్తికాగా.. 60 శాతం కోయాల్సి ఉంది. అయితే.. పెరిగిన డీజిల్ ధరలతో హార్వెస్టర్ ధరలను భారీగా పెంచారు. 2016లో లీటర్ డీజిల్ రూ.52 ఉండగా.. ప్రస్తుతం 97.66కు పెరిగింది. దాంతో గతంలో వరి కోయడానికి మిషన్‌కు గంటకు రూ.2500 ఉండగా ఇప్పుడు రూ.3500కు పెరిగింది. ట్రాక్టర్ల కిరాయి సైతం పెరిగింది. ధాన్యం తరలించడానికి ట్రాక్టర్‌కు గతంలో లోకల్ కిరాయి (ఊరిలోనే) రూ.500 ఉంటే.. ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు. ఇతర గ్రామాల నుంచి ధాన్యం తేవాలంటే రూ.3వేల నుంచి రూ.4వేల వరకు కిరాయి అవుతున్నది. వరి కోత మిషన్, ధాన్యం తరలించేందుకు ట్రాక్టర్ కిరాయిలు ఎకరానికి రూ.5వేల వరకు చెల్లించాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో నిత్యం 2.50 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా.
గంటకు ఎకరం పొలం!
వరి సాగు పెరుగడం, కూలీల కొరతతో యంత్రాల వినియోగం పెరిగింది. ఇప్పుడు అరెకరం ఉన్న రైతులు సైతం వరి కోత మిషన్లను ఆశ్రయిస్తున్నారు. దాంతో గ్రామాల్లో పదుల సంఖ్యలో హార్వెస్టర్లు దర్శనమిస్తున్నాయి. గతంలో ఒక మండలంలో నాలుగైదు ఉంటే.. ఇప్పుడు ఒక్కో గ్రామంలో ఐదుకు మించి ఉంటున్నాయి. గతంలో టైర్ల మిషన్‌కు ఎకరానికి రూ.2,500 ఉంటే ఇప్పుడు గంటకు రూ.3వేలు తీసుకుంటున్నారు. చైన్ మిషన్‌కు రూ.3వేల నుంచి 3,500 రూపాయలకు పెరిగింది. ఎకరం పొలాన్ని గంటకు పైగా కోస్తున్నారు. ఇందులో 40 నిమిషాలు కోతకు పనిచేస్తే 20 నిమిషాలు వృథాగానే పోతుందని రైతులు పేర్కొంటున్నారు. గంటల లెక్క కావడంతో అర్ధగంటలో అయ్యే పనిని గంట చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
వరితో పోల్చితే వాణిజ్య పంటలే మేలు
పెరిగిన ధరలతో రైతులు వరి బదులు వాణిజ్య పంటలే మేలని భావిస్తున్నారు. అందుకే ఈ యాసంగిలో ఆరుతడి పంటలు వేయాలనే ఆలోచనలో రైతులు ఉన్నారు. ఎకరం వరి సాగుకు రూ.30వేల పెట్టుబడి అవుతుంది. ఆదాయం రూ.40 వేలు వస్తుంది. ఎంత కష్టపడినా రైతులకు మిగిలేది రూ.10వేలే. ఈ క్రమంలో పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ వచ్చే పత్తి, పెసర, కంది వంటి పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
కేంద్ర సర్కారుకు రైతుల గోస అర్థమైతలేదు
కేంద్ర ప్రభుత్వానికి రైతుల గోస అర్థమైతలేదు. ఇష్టమొచ్చినట్లు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతుంది. రైతు వ్యతిరేక విధానాలు తెస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతులను పోత్సహిస్తుంటే.. కేంద్రం మాత్రం భారం మోపాలని చూస్తుంది. ఇది సరికాదు.
– శ్రీనివాస్, రైతు, జలాల్పురం, తిరుమలగిరి మండలం