యాదాద్రి, నవంబర్ 14 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొల్పారు. తిరువారాధన నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు బాలబోగం నిర్వహించారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఉదయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. సుమారు గంటన్నర పాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని తిలకించారు.
సాయంత్రం తిరువారాధన, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవోత్సవం జరిపారు. కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా స్వయంభూ ఆలయం, అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి శివాలయంలో శివుడికి దీపారాధన, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కొండ కింద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పెద్ద సంఖ్యలో 756మంది దంపతులు పాల్గొన్నారు.
కార్తిక బహుళ షష్టి సందర్భంగా వ్రత మండపంలో కార్తిక తులసీ దామోదర వ్రతం ఘనంగా నిర్వహించారు. ఒక్కరోజు జరిపే ఈ ఉత్సవంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి దంపతులు పాల్గొన్నారు. రామలింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు నిర్వహించారు. సాయంత్రం శివాలయ మాఢవీధుల్లో రామలింగేశ్వరుడికి తిరువీధి సేవ నిర్వహించారు.
పాతగుట్ట ఆలయంలో కార్తిక మాస వేడుకలు ఘనంగా జరిగా యి. ఉదయం నుంచి సాయం త్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సుమారు 25వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.33,68,217 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
రాయగిరి చెరువు కట్ట వద్ద వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మినీ శిల్పారామం పనులను అర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ లింగయ్య సోమవారం పరిశీలించారు. బోటింగ్, ఫౌంటెయిన్ పనులు, శిల్పారామం ప్రాంగణంలో నిర్మాణాలను క్షేత్రస్థాయి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని అధికారులు సూచించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని కల్పించేందుకు వైటీడీఏ చేపట్టిన మినీ శిల్పారామం పనులు చకాచకా సాగుతున్నాయి. వచ్చే నెలల్లో శిల్పారామాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఆయన వెంట ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, స్తపతి మోతీలాల్, హేమాద్రి పాల్గొన్నారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 3,43,000
వీఐపీ దర్శనాలు 60,000
బ్రేక్ దర్శనం 1,08,300
వేద ఆశీర్వచనం 15,000
సుప్రభాతం 1,000
ప్రచార శాఖ 49,000
వ్రత పూజలు 6,04,800
కళ్యాణకట్ట టిక్కెట్లు 1,11,900
ప్రసాద విక్రయం 13,08,600
వాహన పూజలు 23,200
అన్నదాన విరాళం 1,60,328
సువర్ణ పుష్పార్చన 91,328
యాదరుషి నిలయం 65,852
పాతగుట్ట నుంచి 83,790
కొండపైకి వాహన ప్రవేశం 3,00,000
శివాలయం 21,300
ఇతర విభాగాలు 14,016