మాయ మాటలు, మోసపు హామీలతో రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి అలవాటు పడిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి తన నైజాన్ని బయట పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గానికి ఏమీ చేయక, సొంత కాంట్రాక్టుల కోసం బీజేపీలోకి మారి టీఆర్ఎస్ను ఓడిస్తానని ప్రగల్భాలు పలికిన ఆయనకు మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పారు. ప్రజలిచ్చిన తీర్పును జీర్ణించుకోలేక పోతున్న రాజగోపాల్‌రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారు. మునుగోడు ప్రాంత లబ్ధిదారుల అకౌంట్లో ప్రభుత్వం గొర్రెల యూనిట్ నగదును జమ చేయడం ఓర్వలేక ఈసీకి ఫిర్యాదు చేసిన రాజగోపాల్‌రెడ్డే ఇప్పుడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు అండగా నిలిచిన గొల్లకురుమలను రెచ్చగొట్టాలని చిల్లర రాజకీయానికి దిగారు.
సోమవారం మునుగోడులో ధర్నా పేరుతో నాటకం ఆడగా, వాస్తవం తెలిసిన గొల్లకురుమలు ఆయనకు మద్దతు తెలుపకపోవడం గమనార్హం. దాంతో రాజగోపాల్‌రెడ్డి గ్రామాలకు సొంతంగా వాహనాలు పంపించి తన అనుచరులు, బీజేపీ కార్యకర్తలను తరలించి ధర్నా చేపట్టారు. తాసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని నడిరోడ్డుపై పెట్టి హల్చల్ చేయాలని చూశారు. పోలీసులతో ఘర్షణ పడి హైడ్రామా సృష్టించి మీడియాలో ఫోకస్ కావాలన్నదే లక్ష్యంగా కనిపించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మునుగోడు మీదుగా సాగే టీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీలో అలజడి సృష్టించి లబ్ధి పొందాలని చూడగా, టీఆర్ఎస్ శ్రేణులు సంయమనం పాటించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్14(నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు గొర్రెల కొనుగోలు కోసం ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా మునుగోడు ప్రాంతంలోని లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమచేసింది. దీన్ని తట్టుకోలేని రాజగోపాల్‌రెడ్డి, బీజేపీ నేతలు ఈ పథకాన్ని నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించిన సంగతి తెలిసిందే. దాంతో లబ్ధిదారుల అకౌంట్లలో నగదు అలాగే ఉండిపోయింది.
గొర్రెలను కొనిపించడం ద్వారా గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ పథకం లక్ష్యం. ఇప్పటివరకు ప్రభుత్వం అలాగే ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చింది. తొలి విడుతతో పోలిస్తే ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్(డీబీటీ) అనే పద్ధ్దతిలోఅమలు చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో యాదాద్రి, నల్లగొండ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ ప్రాంతానికి చెందిన 7,600 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేసింది. ఇంతలోనే ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావడం, బీజేపీ నేతలు పిర్యాదు చేయడంతో పథకం అమలు నిలిచిపోయింది. నగదు లబ్ధిదారుల ఖాతాల్లోనే ఉన్నది.ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది.
అతి త్వరలోనే పథకాన్ని గ్రౌండింగ్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతుంది. కాగా తెలంగాణ వచ్చాక అన్ని వృత్తుల వారినీ ఆర్థ్ధికంగా, సామాజికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే గతంలో ఎవరూ ఊహించని, అమలు చేయని విధంగా రాష్ట్రంలోని గొల్లకురుమలందరికీ గొర్రెల పంపిణీ పథకం ద్వారా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలువాలని కేసీఆర్ సంకల్పించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నది సత్యం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గొల్లకురుమలంతా సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నారు. గతంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ రాజగోపాల్‌రెడ్డి కుయుక్తులు మొదలుపెట్టారు.
రాజకీయ డ్రామా…
వాస్తవంగా గతంలో ఎంపీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజల కోసం చేసిందేమీ లేదు. ఓ ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ ప్రజలకు చేయాల్సిన అసలు బాధ్యతను విస్మరించి, కేవలం వ్యక్తిగతంగా అక్కడో ఇక్కడో ఆర్థ్ధికంగా సాయం చేసి దాన్నే భూతద్దంలో చూపుతూ ప్రజలను మోసం చేయడంలో రాజగోపాల్‌రెడ్డి దిట్ట అని ఇప్పటికే అనేకసార్లు స్పష్టమైంది. సొంత డబ్బులతో తాత్కాలికంగా జనాన్ని మాయ చేసి ఓట్లు వేయించుకుని బయటపడే రాజగోపాల్‌రెడ్డి తత్వం ఇప్పటికే ప్రజలకు బోధపడింది. అందుకే ఉప ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పారు.
అయినా తీరు మార్చుకోని రాజగోపాల్‌రెడ్డి మరోరూపంలో రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారు. గొల్లకురుమలకు నగదు బదిలీ చేయాలంటూ ధర్నా పేరుతో సోమవారం మునుగోడులో హంగామా చేశారు. వాస్తవంగా ఈ ధర్నాలో లబ్ధి జరగాల్సిన లబ్ధిదారులు మచ్చుకు కూడా కనిపించలేదు. ఎవరి కోసమైతే ధర్నా అని చెప్పారో వారే ధర్నాకు దూరంగా ఉన్నారు. దాంతో గ్రామాలకు సొంతంగా వాహనాలు పంపించి తన అనుచరులు, బీజేపీ కార్యకర్తలను తరలించి ధర్నా చేపట్టారు. తాసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని నడిరోడ్డుపై పెట్టి హల్చల్ చేయాలని చూశారు. పోలీసులతో ఘర్షణ పడి హైడ్రామా సృష్టించి మీడియాలో ఫోకస్ కావడమే లక్ష్యంగా ధర్నా కొనసాగింది.
ముందస్తు షెడ్యూల్ ప్రకారమే..
ముందస్తు షెడ్యూల్ ప్రకారం మునుగోడు మీదుగా సాగే టీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీలోనూ అలజడి సృష్టించాలని చూడగా టీఆర్ఎస్ శ్రేణులు సంయమనం పాటించాయి. మరోవైపు పోలీసులు కూడా బందోబస్తుతో పరిస్థితిని అదుపు తప్పకుండా సమీక్షిస్తూ వచ్చారు. చివర్లో రాజగోపాల్‌రెడ్డి ధర్నాను ఎవరూ పట్టించుకోకపోవడంతో పోలీసులను బతిమిలాడి అరెస్టు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లకుండా ఆయన అనుచరులు అడ్డుపడుతున్నట్లుగా కొద్ద్దిసేపు మీడియా కోసం డ్రామాను కొనసాగించారు. మొత్తంగా గొల్ల కురుమలను టీఆర్ఎస్కు దూరం చేయాలన్న కుట్రతో చేసిన రాజకీయ డ్రామాతో రాజగోపాల్‌రెడ్డి నవ్వులపాలయ్యాడన్నది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు
గొల్లకురుమల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పం. ఈ పథకంలో కొన్ని మార్పులు చేసి డీబీటీ పద్ధ్దతిలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలన్నది మా ఉద్దేశం. దీనిపై బీజేపీ కుట్రలు చేస్తూ అడ్డుకుంది. అయినా లబ్ధిదారుల అకౌంట్లలో నగదు అలాగే ఉంది. ఈ నగదును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్న మాటలు శుద్ధ్ద అబద్దం. ధర్నాల పేరుతో రాజకీయ డ్రామాలు వద్దు. గొల్లకురుమలు ఇప్పటికే ఉప ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పారు. దేశవ్యాప్తంగా యాదవులకు బీజేపీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. అఖిలేశ్‌యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్‌కుమార్ వంటి నేతలను అణగదొక్కాలని చూసు ్తన్నది. ఇక్కడా కూడా రాజగోపాల్‌రెడ్డి అదే పద్ధ్దతిని అనుసరిస్తున్నారు.
– దూదిమెట్ల బాలరాజుయాదవ్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్