రామగిరి, నవంబర్ 13: విజ్ఞాన నిలయాలు గ్రంథాలయాలు. వీటిలో గతంలో న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్, కథలు, నవలలు, చరిత్ర పుస్తకాలు చదివేందుకు ప్రజలు, యువకులు, కవులు, రచయితలు వచ్చేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రభుత్వం వెల్లడించే వివిధ నోటిఫికేషన్స్‌లో విజయం సాధించేలా ఉద్యోగార్థులను సిద్ధం చేసే వేదికలుగా మారుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రశాంతమైన వాతావరణంలో ఖర్చు లేకుండా పోటీ పరీక్షలతోపాటు ఇతర పుస్తకాలు, మ్యాగజైన్స్, దినపత్రికలు ఉచితంగా అందుబాటులో ఉండటంతో క్యూ కడుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి మూసే వరకు నిత్యం 350 మందికి పైగా ప్రిపరేషన్‌కు వస్తున్నారు. గతంలో వివిధ ప్రభుత్వ నోటిఫికేషన్లలో జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వచ్చి చదివిన వారిలో 131 మంది వివిధ శాఖల్లో ప్రభుత్వ కొలువులు సాధించారంటే ఇక్కడ ఉన్న వసతులు దర్పణం పడుతున్నాయి. దీంతో ఈ లైబ్రరీ నిరుద్యోగుల పాలిట కల్పతరువుగా మారింది.
జిల్లా గ్రంథాలయ సంస్థ చరిత్ర..
తెలంగాణ గ్రంథాలయోద్యమ చరిత్రలో నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రామాల్లో గ్రంథాలయాల స్థాపన అనే నినాదంతో వట్టికోట ఆళ్వారుస్వామితో పల్లెల్లో గ్రంథాలయాలు స్థాపించిన ఘనత నల్లగొండది. గ్రంథాలయ సేవలో వందేండ్ల ప్రస్థానంలో కలిగిన నల్లగొండ గ్రంథాలయానికి విశిష్ట స్థానం ఉంది. భావితరాల భవిష్యత్తే లక్ష్యంగా 1918 మార్చి 13న పులిజాల వెంకటరామారావు, షబ్నవీసు వెంకటనరసింహారావు, జగిని ఆదినారాయణగుప్తా వంటి ప్రముఖులు ‘ఆంధ్ర సరస్వతి’ నిలయాన్ని ఏర్పాటు చేశారు. నాడు 152 పుస్తకాలతో ప్రారంభమైన గ్రంథాలయం జూలై 1, 1955లో జిల్లా గ్రంథాలయ సంస్థగా పురుడుపోసుకుంది. జిల్లా పునర్విభజన అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయం జిల్లాకే వన్నె తెచ్చింది. ప్రస్తుతం జిల్లా కేంద్ర గ్రంథాలయంతోపాటు జిల్లా వ్యాప్తంగా అనుబంధంగా ఉన్న 27 గ్రంథాలయాల్లో 2,13, 568 పుస్తకాలు, 1,18,215 మంది సభ్యులతో నేటి ఆధునిక తరానికి మౌలిక వసతులతో సేవలందిస్తున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయం గ్రేడ్ -1గా, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్ గ్రంథాయాలు గ్రేడ్-2గా సేవలందిస్తున్నాయి. వీటితోపాటు జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్‌లోని మహిళలు, పిల్లల గ్రంథాలయం, అన్ని మండల కేంద్రాల్లోని గ్రంథాయాలు గ్రేడ్ -3 హోదాలో నిత్యం సేవలందిస్తున్నాయి.
ఆదరణ పెరిగింది ఇలా..
జ్ఞానాన్ని అందించేందుకు ఏర్పాటైన గ్రంథాయాల్లో ఒకప్పుడు సీటు దొరికే పరిస్థితి ఉండేది కాదు. ఏదైనా మ్యాగజైన్ చదవాలంటే ఎదుటి వ్యక్తి చదవడం పూర్తయ్యేవరకు ఎదురుచూసే స్థితి ఉండేది. కానీ సెల్‌ఫోన్స్, ఇంటర్నేట్ అందుబాటులోకి వచ్చిన క్రమంలో గ్రంథాలయాల అనుబంధం కాస్తా తగ్గుతూ వచ్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత గ్రంథాలయాల ఆవశ్యకతను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి వసతులు కల్పించడంతో తిరిగి ఆదరణ పెరిగింది. 2017-18లో ప్రభుత్వ కొలువుల నోటిఫికేషన్ సమయంలో ఎందరో నిరుద్యోగులు ఉద్యోగాల సాధనకు ఇందులోనే ప్రిపేరై ఉద్యోగాలు సాధించారు. తాజాగా భారీస్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదలవుతుండడంతో మళ్లీ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదివేందుకు క్యూ కడుతున్నారు.
నల్లగొండ జిల్లా లైబ్రరీలో ప్రత్యేక వసతులు..
గతంలో ఇరకుగా ఉన్న లైబ్రరీలో స్త్రీ, పురుషులకు ప్రత్యేకంగా స్టీడీ రూమ్స్‌ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహకారంతో నిర్మించారు. ప్రత్యేక స్టడీ హాల్స్‌తో నిత్యం సుమారు 80 నుంచి 90 మంది మహిళలు, 290మందికి పైగా పురుషులు వస్తున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడే ఉండి ప్రశాంతంగా చదవుతున్నారు.
నేటి నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 21వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగనున్నాయి. రోజూ ఒక ప్రత్యేక కార్యక్రమంతో ఉత్సవాలు కొనసాగుతాయి.
– సోమవారం ప్రారంభోత్సవ వేడుకలను జిల్లా కేంద్ర గ్రంథాయంలో ముఖ్య అతిథిగా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, సభాధ్యక్షుడిగా నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హాజరుకానున్నారు.
– 15న పుస్తక ప్రదర్శన, 16న వ్యాసరచన పోటీలు, మధ్యాహ్నం ఉపన్యాస పోటీలు, 17న చిత్రలేఖనం, సాయంత్రం సమాచార హక్కు చట్టంపై అవగహన సదస్సు, 18న గ్రంథాలయాల్లో ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు సన్మానం, కళాశాల, పాఠశాలల విద్యార్థులకు క్విజ్, 19న మహిళా కార్యక్రమాలు, 20న కవి సమ్మేళనం, 21న ముగింపు కార్యక్రమం జరుగనున్నాయి. ముగింపు వేడుకలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రజాప్రతిధులు, అధికారులు హాజరు కానున్నారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేస్తారు.
ఎన్జీ, ఉమెన్స్ కళాశాలల్లో..
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ), రామగిరిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(ఉమెన్స్)గ్రంథాలయాలు సహితం విద్యార్థులకు సేవలందిస్తున్నాయి. ఇక్కడ ఉన్న గ్రంథాలయాల్లో యూనివర్సిటీలకు దీటుగా వేల సంఖ్యలో పుస్తకాలను అందుబాటులో ఉంచారు. అంతే కాకుండా డిజిటల్ లైబ్రరీ, ఈ-బుక్స్, ఈ-లైబ్రైరీ, ప్రత్యేక వెబ్సైట్లలో వివిధ అంశాలు అందుబాటులో ఉన్నాయి. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ కళాశాలల్లో 14న పుస్తక ప్రదర్శన, 15 పుస్తక సమీక్ష, వ్యాసరచన, 16న వక్తృత్వ పోటీలు, 17, 18న క్విజ్, 19న విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్స్ ప్రదానం చేయనున్నారు.
వారోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
సీఎం కేసీఆర్ ఉత్తర్వులతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం గ్రంథాలయానికి వచ్చే పాఠకులు, నిరుద్యోగుల సేవే లక్ష్యంగా పనిచేస్తున్నాను. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధుల సహకారంతో కృషి చేస్తున్నాను. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో గ్రంథాలయాలకు పూర్వవైభవం వచ్చింది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగులు, పాఠకుల కోరిక మేరకు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలతోపాటు మ్యాగజైన్స్, ఇతర పుస్తకాలు కాలానునుగుణంగా అందుబాటులో ఉంచుతున్నాం. నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థతోపాటు జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల్లో ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశాం.
-రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ, నల్లగొండ