నీలగిరి, నవంబర్ 12 : సీఎం కేసీఆర్ ఢిల్లీ ప్రయాణంతో తమ ప్రభుత్వానికి ప్రమాదం ఉందనే అక్కసుతోనే ప్రధాని మోదీ ఆఘ మేఘాల మీద హైదరాబాద్‌కు తరలివచ్చి విషం చిమ్మారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి ఎనమిదేండ్లు దాటినా తెలంగాణకు రాజ్యంగ బద్ధంగా రావాల్సిన గ్రాంట్లు, నిధులు మినహా ఇతర నిధులు, ప్యాకేజీలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ఎన్ని దుర్మార్గాలు చేసినా, కేంద్ర బలగాలతో దాడి చేయించినా తమ పార్టీ ఓడిపోయిందనే అక్కసుతోనే రాష్ట్రంపై విషం చిమ్మేందుకే గతంలోనే ప్రారంభమైన కర్మాగారాన్ని మళ్లీ ప్రారంభించే నెపంతో ఆయన వచ్చారన్నారు. మోదీ పర్యటనతో తెలంగాణకు కొత్తగా ఒరిగింది ఏమీ లేదన్నారు.
ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణకు పలుమార్లు వచ్చిన మోదీ ఒక్క పైసా ఇచ్చిన సందర్భాలు ఏమీ లేవన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తామని మోదీ చెప్పారని.. రాష్ర్టానికి రావాల్సిన అసలు ఇస్తే చాలని పేర్కొన్నారు. భారతదేశ ప్రజలు మోదీకి వడ్డీతో సహా చెల్లించే రోజులు ముందున్నాయన్నారు. తెలంగాణకు వచ్చి సీఎం కేసీఆర్‌పై ఎందుకు విషం చిమ్మారో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తూ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతుంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టిస్తున్నదన్నారు. అయినా సీఎం కేసీఆర్ వాటన్నింటినీ అధిగమిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తుంటే చివరకు బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురిచేస్తూ అభివృద్ధిని అడ్డుకోవాలని బీజేపీ ప్రభుత్వం చూసిందన్నారు. మరోవైపు టీఆర్ఎస్లో అలజడి తేవాలని కుట్రలు చేశారని పేర్కొన్నారు.
కానీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ చెక్కుచెదరలేదన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానం మరోమారు మునుగోడు ఎన్నికల్లో రుజువైందన్నారు. ఇది తట్టుకోలేకే ప్రధాని మోదీ ఆగమేఘాల మీద హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌పై విషం చిమ్మే ప్రయత్నం చేశారన్నారు. 2001 నుంచి సీఎం కేసీఆర్ ‘తెలంగాణ నా స్వప్నం’ అని ప్రకటించి ఉద్యమాలు చేసి, 2009లో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించారన్నారు. ఎనిమిది సంవత్సరాల్లోనే తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారని పేర్కొన్నారు. మిగతా 28 రాష్ర్టాల మంత్రులు, అధికారులు, అనధికారులు తెలంగాణకు వచ్చి పథకాలు చూసి వెళ్లారన్నారు. మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకి అయిన మోదీ రాష్ర్టాభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసని ప్రధాని మాటలు విని మోసపోయేందుకు వారు గుజరాతీలు కాదన్నారు. దేశ ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీ బాట పడితే ఆయన ద్వారా ప్రమాదం వస్తుందని భయంతోనే.. కేసీఆర్ ప్రయాణాన్ని అడ్డుకునేందుకే విషం కక్కుతున్నారన్నారు. దేశ ప్రజలంతా కండ్లు తెరుస్తున్నారని.. దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారని.. ఇక ఎంతో కాలం మోదీ ఆటలు సాగమన్నారు. సీఎం కేసీఆర్‌ను బీజేపీ నాయకులు అనరాని మాటలు అన్నారని, వ్యక్తిగత విమర్శలు చేశారని.. కానీ ఏనాడూ కేసీఆర్ వారి జోలికి వెళ్లకుండా విధాన పరమైన విమర్శలు చేశారని గుర్తు చేశారు. అబద్ధపు పునాదులపై పార్టీని నిర్మించాలని ప్రధాని ప్రయత్నిస్తే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాలేశ్వరం, పాలమూరు.. డిండి ఎత్తిపోతల పథకాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి పాల్గొన్నారు.