గరిడేపల్లి, నవంబర్ 12 : పత్తి కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు కిందికి పల్టీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలైన ఘటన మండలంలోని కీతవారిగూడెంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు కూలీలు చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామంలో పత్తి ఏరేందుకు ఆటోలో బయల్దేరారు. కీతవారిగూడెం శివారులోని పెట్రోల్‌బంక్ సమీపంలో ఆటోకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న కాల్వలోకి పల్టీ కొట్టింది. దాంతో ఆటోలో ఉన్న రేవూరి శ్రీను (45) తలకు తీవ్రగాయాలు కాగా పోలె వెంకన్న, పిట్ట వెంకన్న, యడవెల్లి పిచ్చిరెడ్డి, రేవూరి ముత్తమ్మకు బలమైన గాయాలయ్యాయి. వారిని వెంటనే హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శ్రీను మృతి చెందాడు. గ్రామానికి చెందిన మరో 8మంది కూలీలకు స్వల్ప గాయాలు కావడంతో హుజూర్నగర్ ఆస్పత్రిలోనే చికిత్స అందించారు. శ్రీను భార్య రేవూరి జ్యోతి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ నాగవెల్లి నాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్ఐ కొండల్‌రెడ్డి తెలిపారు. మృతుడు శ్రీనుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.