యాదాద్రి, నవంబర్ 12 : కార్తిక మాసం మూడో శనివారం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రం భక్తులతో సందడిగా కనిపించింది. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. కొండపైన పార్కింగ్ ప్రాంతంతో పాటు వివిధ ప్రాంతాల్లో వాహనాల రద్దీ కనిపించింది. స్వామి వారి ధర్మ దర్శనానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు.
స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్భార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. కార్తిక మాసం కావడంతో దీపారాధన, సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 1,141మంది దంపతులు వ్రత పూజల్లో పాల్గొన్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారిని సుమారు 46వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.47,16,757 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.