నీలగిరి, నవంబర్ 12 : అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ మెడికల్ కళాశాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జాతికి ప్రపంచాన్ని పరిచయం చేసేది అమ్మ అయితే, చివరి క్షణం వరకూ జీవితం సాఫీగా సాగేలా పునర్జన్మను ప్రసాదించేది వైద్యులని కొనియాడారు. 2014కు ముందు రాష్ట్రంలో జనం సర్కారు దవాఖానకు వచ్చేవారు కాదని, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ పాటలు పాడారని గుర్తుచేశారు. నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు.
ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంతోపాటు ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడం వల్ల ప్రజా వైద్య వ్యవస్థ బలోపేతమైందని వివరించారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వ దవాఖానలు, వైద్య బృందాలు పేద ప్రజలను ప్రాణాపాయ స్థితిలోనూ అక్కున చేర్చుకుని ఆయువు నిలిపాయని కొనియాడారు. వైద్య విద్యార్థులంతా వృత్తిలో రాణించాలని ఆకాక్షించారు. మూడేండ్లలో నల్లగొండ జిల్లా నుంచి 720మంది, రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువ వైద్యులను తయారు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా యువ డాక్టర్ల తయారులో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. వచ్చే సంవత్సరం నాటికి మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మించి వేడుకలు ఆడిటోరియంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలు తెచ్చిన ఘనత మంత్రి జగదీశ్రెడ్డిదేనని కొనియాడారు. ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ డాక్టర్లుగా పట్టాలు పొందాక పేదలకు సేవ చేయడంతో పాటు, భవిష్యత్‌లో ఉన్నతమైన ప్రాణదాతలుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కళాశాల సూపరింటెండెంట్ లచ్చునాయక్, ప్రిన్సిపాల్ రాజకుమారి, వైస్ ప్రిన్సిపాల్ నిత్యానందం, అరుణకుమారి సిబ్బంది పాల్గొన్నారు.
అద్వితీయంగా వేడుకలు
మెడికల్ కళాశాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లక్ష్మీగార్డెన్స్‌లో నిర్వహించిన అద్వితీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు అని తేడా లేకుండా పాటలకు స్టెప్పులు వేసి సందడిగా కనిపించారు.