నార్కట్‌పల్లి, నవంబర్ 12: ఏరు దాటేవరకు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడ మల్లయ్య అన్న చందంగా ఉన్నది రైల్వేశాఖ తీరు. కాపలా లేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద యుద్ధప్రాతిపాదికన అండర్‌పాస్‌లను ఏర్పాటు చేసిన రైల్యే శాఖ వాటి వద్ద తగిన రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. అంతేకాకుండా అండర్ పాస్‌ల వద్ద చిన్న చినుకు పడ్డా వరద నీరు నిలిచి చెరువులను తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు మృత్యువాత పడుతున్నారు.
రక్షణ వ్యవస్థ లేక ప్రమాదాలు..
కాపలా లేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ నార్కట్‌పల్లి నుంచి మునుగోడుకు వెళ్లే రోడ్డుపై రెండు అండర్ పాస్ ఏర్పాటు చేసింది. నత్త నడకన నాసిరకంతో పనులు పూర్తి చేసింది. చుట్టూ ఎలాంటి గోడలను నిర్మించలేదు. విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయకపోవడంతో ఓ వ్యక్తి రాత్రి సమయంలో అండర్ పాస్‌లో బైక్‌పై వెళ్తూ ఏమీ కనిపించకపోవడంతో పిల్లర్‌కు ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. అ రాత్రి ఎవరూ గమనించకపోవడంతో తెల్లారేసరికి మృతిచెందాడు. దీంతో చాలా మంది లెవల్ క్రాసింగ్ ఏర్పాటుపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సరైన నిర్వహణ లేక..
లెవెల్ క్రాసింగ్‌ల వద్ద పట్టాలను దాటి వెళ్లేందుకు రైల్వేశాఖ చేసిన ప్రయత్నం బాగుంది. అండర్‌పాస్‌లు నిర్మించిన తర్వాత సరైన నిర్వహణ లేకపోవడంతో ప్రమాదభరి తంగా మారుతున్నాయి. చిన్న వర్షం పడినా నీరు నిలిచిపోతున్నది. దాంతో వాహనాలు దాటే పరిస్థితి లేదు. ఇంకా భారీ వర్షాలు పడితే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది.
– ప్రజ్ఞాపురం రామక్రిష్ణ, వాహనదారుడు, నార్కట్‌పల్లి
ప్రమాదాలు జరుగుతున్నాయి..
అండర్ పాస్‌ల ఏర్పాటుతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రణాళికా బద్ధ్దంగా నిర్మించకపోవడంతో కొంతమందికి దగ్గరకు వచ్చేంత వరకు ఇక్కడ రైల్వే అండర్ పాస్ ఉందని తెలియక ప్రమాదాల బారిన పడుతు న్నారు. అండర్‌పాస్ లోపల రైల్వే శాఖ ఎలాంటి లైటింగ్, భధ్రత నియమాలు చేపట్టకపోవడంతో వాహనదారులు మధ్యలో ఉన్న పిల్లర్‌ను ఢీ కొట్టి తీవ్ర గాయాలపాలవుతున్నారు. రేల్వే శాఖ పనితీరు సరిగా లేదు.
– మహేశ్వరం సతీశ్, సర్పంచ్, ఎనుగులదొరి