కార్మికులకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కల్పతరువులా మారింది. ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చే కూలీలకు కంచంలో మెతుకవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల ఇబ్బందులు, కరెంట్ కోతలతో పనుల్లేక జిల్లా వాసులు ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లగా, కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి. వ్యవసాయ రంగంతోపాటు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయి. దాంతో ఉత్తరాది రాష్ర్టాల కార్మికులు జిల్లాకు వలస కట్టారు. రైస్ మిల్లులు, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగం, పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో సుమారు 25వేలు, సూర్యాపేట జిల్లాలో 4 వేల మంది ఉపాధి పొందుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఉంది. దాంతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ఫలితంగా కూలీలు సైతం పని కోసం జిల్లాకు బారులుదీరుతున్నారు. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగా.. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, మిల్లుల్లో కూలీలుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. భువనగిరి పట్టణంలోని జగదేవ్‌పూర్ రోడ్డు వంటి చోట్ల ఉదయం వందల మంది కూలీలు దర్శనమిస్తారు. వివిధ రకాల పనుల కోసం అక్కడ ఎదురు చూస్తుంటారు. జిల్లాలోని బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు, ఆలేరు, యాదగిరిగుట్ట తదితర మండలాల్లో వలస కార్మికులు పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 25వేల మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వారంతా బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ర్టాల నుంచి వచ్చారని పేర్కొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కార్మికులు జిల్లాలోని పోచంపల్లి మండలానికి వలస వస్తున్నారు. నాట్లు, కోతల సమయంలో వందల మంది వచ్చి ఇక్కడే కొన్ని రోజులు ఉండి ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరు రోజుకు రూ.800దాకా సంపాదిస్తున్నారు. ఈ వానకాలం సీజన్లో చాలా మంది నాట్లు వేసి వెళ్లారు.
వివిధ రాష్ర్టాల నుంచి వచ్చేవారంతా ఇక్కడే చిన్న చిన్న ఇండ్లల్లో కిరాయికి ఉంటున్నారు. కొంత మంది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉంటున్నారు. వారంతా కూలి తక్కువ అయినా పనికి వెనుకాడటం లేదు. పైగా ఎక్కువ గంటలు పని చేస్తున్నారు. సాధారణంగా స్థానిక కూలీలు ఉప్పరి పనికి రూ.వెయ్యి తీసుకుంటుండగా.. వలస కూలీలు రూ.600 నుంచి రూ.700తో సరిపెట్టుకుంటున్నారు. దాంతో యజమానులు వారిని పనిలో పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వలస కూలీల తరలింపునకు ప్రత్యేకంగా దళారులు ఉంటున్నారు. వారే కూలీలను పని దగ్గరకు తీసుకెళ్తారు. అసలు ఓనరు ఒక్కో కూలీకి రోజుకు రూ.వెయ్యి ఇస్తే.. అందులో దళారి రూ.రెండు నుంచి రూ.మూడు వందల వరకు కమీషన్ నొక్కేస్తున్నారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ఇంకా అనేక రాష్ర్టాలు పేదరికంలో మగ్గుతున్నాయి. కనీసం తినడానికి తిండి.. ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితి. పని దొరక్క ఉపాధి లేక అల్లాడుతున్నారు. ఉత్తరాది రాష్ర్టాల్లో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంది. అక్కడి ప్రభుత్వాలు ప్రజల ఉపాధికి ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు. దాంతో అక్కడున్న వారంతా పని కోసం తెలంగాణ బాట పడుతున్నారు. ఇక్కడ పనులు పుష్కలంగా దొరుకుతుండడంతో డబ్బులు సంపాదిస్తున్నారు. పండుగ, పబ్బాలకు సొంతూర్లకు వెళ్లి అక్కడ ఏమైనా అప్పులు ఉంటే చెల్లించుకుంటున్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అలాగే చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టింది. దాంతో చెరువులు ఎప్పుడూ నీటితో జలకళను సంతరించుకుంటున్నాయి. అంతేగాకుండా రైతులకు రైతుబంధు సాయం చేస్తున్నది. గతంలో నీళ్లు లేక, సర్కారు సాయం లేక అనేక మంది సాగుకు దూరమయ్యారు. వారంతా ఇతర ప్రాంతాలకు పనులకు పోయి జీవనం కొనసాగించేవారు. ఇప్పుడు నీళ్లు, సాగుకు ఆర్థిక సాయం అందుతుండటంతో ఆ కూలీలంతా సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. మరికొందరు భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. దాంతో కూలీలకు డిమాండ్ పెరిగింది.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజల బతుకులు అధ్వానంగా ఉండేవి. ఆంధ్రోళ్ల పాలనలో ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇక్కడ పనుల్లేక అనేక మంది ఇతర రాష్ర్టాలకు వలసలు వెళ్లేవారు. ముఖ్యంగా చేనేత కార్మికులు మహారాష్ట్రలోని భీమండి, గుజరాత్‌లోని సూరత్, తమిళనాడు రాష్ర్టాలకు వెళ్లేవారు. భవన నిర్మాణ కార్మికులు మహారాష్ట్రకు వలస పోయేది. ఇప్పుడా పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి.
సూర్యాపేట, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పనుల్లేక అనేక కుటుంబాలు పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ర్టాలకు వలసపోయేది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంతోపాటు అనేక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంతో ఇంచు భూమి లేకుండా సాగవుతున్నది. విద్యుత్ నిరంతరం అందిస్తుండడంతో పరిశ్రమలు 24 గంటలు పనిచేస్తున్నాయి. దాంతో భూమి ఉన్నవారు సొంతంగా సాగు చేసుకుంటుండగా.. ఇతర రాష్ట్రాలకు వలసపోయిన వారు సైతం తిరిగి వచ్చి ఇక్కడే ఉపాధి పొందుతున్నారు.
జిల్లాలో పనులు పుష్కలంగా దొరుకుతుండడంతో ఇతర రాష్ర్టాల కూలీలు వేలాదిగా ఇక్కడికి తరలి వస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయా రంగాల్లో పని చేస్తున్న వలస కార్మికుల సంఖ్య దాదాపు 4వేల వరకు ఉంటుంది. జిల్లాలో 73 రైస్ మిల్లులు ఉండగా.. దాదాపు అన్నింటిలోనూ 50 నుంచి 70 శాతం మంది బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులు ఉన్నారు.
సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల పట్టణాలతోపాటు ఇతర ప్రాంతాల్లో జరిగే భారీ, చిన్న నిర్మాణాలతోపాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ పనులు చేసేవారు 90 శాతం వరకు బయటి రాష్ర్టాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఇటుక బట్టీలు, డైరీ ఫామ్‌లు, ప్రతి రంగంలోనూ వలస కార్మికులే కనిపిస్తున్నారు. అయితే.. ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు రావడంతో తమకు ఇబ్బందులు తప్పాయని పలు సంస్థల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. స్థానిక కూలీల కంటే 20శాతం తక్కువ కూలి చెల్లిస్తున్నామని, తద్వారా ఆర్థిక భారం కూడా తగ్గిందని చెప్తున్నారు.
మాది రాజస్థాన్. మా ఊరిలో రోజూ పని దొరికేది కాదు. పని లేకపోవడంతో డబ్బులకు ఇబ్బందులు పడేది. ఇక్కడికి వచ్చినంక రోజూ పని దొరుకుతుంది. బీబీనగర్‌కు వచ్చినప్పటి నుంచి స్వీట్ షాపులో పనిచేస్తున్న. ఇప్పుడు చేతినిండా డబ్బులు ఉంటున్నాయి. మా ఊరిలో దినాం మొత్తం పని చేస్తే రెండొందలు వచ్చేది. ఇక్కడ ఐదు వందలకు పైగా వస్తున్నాయి. మా ఇంటికి నెలనెలా జీతం డబ్బులు పంపిస్తున్న. అక్కడి కంటే ఇక్కడే సంతోషంగా ఉన్న.
– మహావీర్, రాజస్థాన్ రాష్ట్రం
గతంలో మా కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉండేది. మా రాష్ట్రం (బీహార్)లో పని దొరుకక రోడ్ల వెంట తిరుగుతుంటే తారాచంద్ తీసుకొచ్చి నాకు పని ఇప్పించాడు. సంవత్సరంన్నర క్రితం ఇక్కడికి వచ్చాను. హమాలీగా పని చేస్తున్నా. దినాం పని దొరుకుతుంది. ఖాళీ సమయం లేకుండా పని చేసుకుంటున్నా. మా ఇంటికి రెండు లేదా మూడు నెలలకు ఒకసారి వెళ్లి వస్తున్నా. అయినా ఇబ్బంది లేదు. నేను సంపాదించిన మొత్తంలో నా తిండి ఖర్చులకు కొంత ఉంచుకొని నా భార్యకు పంపిస్తున్నా. ఇబ్బందులు తొలగిపోయాయి.
కొన్నేండ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని కుటుంబంతో కలిసి సూర్యాపేటకు వచ్చాం. కరోనా లాక్డౌన్ సమయంలో కొంత ఇబ్బందులు పడ్డాం. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి మా స్వగ్రామాలకు పంపింది. మళ్లీ సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ప్రతి రోజూ పని దొరుకుతుంది. పనికి తగ్గ వేతనం లభిస్తుంది. ఇక్కడ యజమానులు, ప్రజలు మమ్మల్ని సొంతవారిలా చూసుకుంటున్నారు. మా రాష్ట్రంలో తాపీ మేస్త్రీకి రోజుకు రూ.500 వస్తే.. ఇక్కడ వెయ్యి రూపాయల వరకు వస్తున్నాయి. ఇక్కడి ప్రభుత్వం సహకరించి లేబర్ కార్డులు ఇస్తే బాగుంటుంది.
మాది బీహార్ రాష్ట్రం. మా దగ్గర కంటే ఇక్కడ కూలి ఎక్కవ ఇస్తున్నారు. రెండు సంవత్సరాలుగా చివ్వెంల మండలం బీబీగూడెంలోని యువన్ కృష్ణ రైస్ మిల్లులో పని చేస్తున్నా. నా తోపాటు 12 మంది కూలీలు ఉన్నారు. మేము మా ఇంటికి రెండు నెలలకోసారి వెళ్తాం. ఒక్కోసారి నాలుగైదు నెలలు కూడా అవుతుంది. మేము పని చేస్తేనే మా కుటుంబం గడుస్తుంది. మా ఊర్లో పనిలేక కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. నేను ఇక్కడికి వచ్చేముందు పని దొరుకుతుందా.. లేదా అని అనుమానం ఉండేది. ఇక్కడికి వచ్చిన తరువాత ప్రతి దినం చేతినిండా పని దొరుకుతుంది. రోజుకు రూ.300నుంచి 400 వరకు కూలి వస్తుంది. ఇప్పుడు మా కుటుంబ ఇబ్బందులు తొలగిపోయాయి. సతోషంగా ఉంది.
– తారాచంద్ ముఖియా, హమాలీ, బీహార్ రాష్ట్రం