మిర్యాలగూడ, నవంబర్ : కొడుకు రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయని ఆ కన్నతల్లి ప్రాణం తల్లడిల్లింది. ఎలాగైనా చాలా దవాఖానలు తిరిగింది. కిడ్నీ మార్చాలని వైద్యులు సూచించడంతో ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు తన కిడ్నీని దానం చేసి పునర్జన్మనిచ్చింది.వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన గీత కార్మిక కుటుంబానికి చెందిన జేరిపోతుల వెంకటయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు గిరిబాబు ఉన్నారు. కూతుర్లు, కొడుకు వివాహం చేసి ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం, గీత కార్మిక వృత్తి చేసుకుంటూ దంపతులు జీవనం సాగిస్తున్నారు. అయితే.. 25 ఏండ్ల 2018లో అనారోగ్యానికి గురయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకొని 2021 వరకు మందులు వాడాడు.
అనారోగ్యంతో ఉన్న గిరిబాబుకు 2021 జూన్‌లో కరోనా సోకింది. దాంతో కిడ్నీ సమస్య ఏర్పడింది. డయాలసిస్ చేయాలని వైద్యులు చెప్పడంతో హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందాడు. దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు తల్లిదండ్రులు. గిరిబాబు పరిస్థితి విషమించడంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తేనే ఆరోగ్యంపై భరోసా ఇస్తామని వైద్యులు సూచించారు. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు కుటుంబ సభ్యులు ఎవరైనా ముందుకొస్తే ఆపరేషన్ చేస్తామని చెప్పారు.
కుమారుడు ప్రాణాపాయ స్థితిలో విలవిల్లాడుతుంటే కన్నతల్లి లక్ష్మి తల్లడిల్లింది. ఎలాగైనా కొడుకును కాపాడుకోవాలని తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఒకటే కావడంతో 2022 జూలై 12న గిరిబాబుకు తల్లి కిడ్నీ అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో 15 రోజుల తర్వాత దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యి స్వగ్రామానికి వచ్చారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.15లక్షల వరకు అప్పు చేశారు. 2019లో టీఆర్ఎస్ వేముపల్లి మండలాధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే భాస్కర్‌రావును కలిసి సీఎంఆర్ఎఫ్ ఇప్పించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే సహాయంతో సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.3 లక్షలు మంజూరయ్యాయి.
కొడుకు ఆరోగ్యం బాలేక అవస్థలు పడుతుంటే సూడలేకపోయేదాన్ని. కిడ్నీ మారిస్తేనే బతుకుతాడని డాక్టర్లు చెప్పడంతో బతికించుకోవాలనుకున్న. డాక్టర్లు ఎన్నో చెప్పినా కొడుకు పాణం కంటే ఏదీ ముఖ్యం కాదని కిడ్నీ ఇచ్చిన. నా కొడుకు, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం. ప్రతి నెలా మందులకు రూ.30వేలు ఖర్చు అయితున్నయి.
– జేరిపోతుల లక్ష్మి
మా అమ్మ ప్రాణాలు లెక్క చేయకుండా కిడ్నీ దానం చేసి మళ్లీ నాకు ఊపిరిపోసింది. అమ్మ మేలు ఏమిచ్చినా తీర్చుకోలేనిది. ఆరోగ్యం బాలేక 2019లో రూ.10 లక్షలు, 2022లో ఆపరేషన్‌కు రూ.15 లక్షలు ఖర్చు అయినయి. మా నాన్న నా అప్పులు తెచ్చి ఆరోగ్యం బాగు చేయించిండు. కష్టాల్లో ఉన్న మమ్ములను సీఎం కేసీఆర్ సారు ఆదుకోవాలని వేడుకుంటున్న.
– జేరిపోతుల గిరిబాబు