మోదీ మరో కొత్త నాటకం
సంవత్సరం క్రితం ప్రారంభమైన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభిస్తామనడం ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అవుతుంది. తెలంగాణ పర్యటన పేరుతో మోదీ మరో కొత్త నాటకం ఆడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు గడిచినా ఒక్క హామీని అమలు చేయని ప్రధాని ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తారు? బీజేపీ పాలనలో కార్పొరేట్లకు తప్ప సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేముంది?
– రవీంద్రకుమార్, టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే
తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే వస్తున్న మోదీ
దేవరకొండ, నవంబర్ 10 : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఏడాది క్రితమే ప్రారంభమైనప్పటికీ మళ్లీ ప్రారంభోత్సవం పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ప్రధాని మోదీ రాష్ర్టానికి వస్తున్నారని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ విమర్శించారు. దేవరకొండ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర పర్యటన పేరుతో ప్రధాని మరో నాటకం ఆడుతున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేండ్లు గడిచినా తెలంగాణకు ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే ముందు ఏం హామీ ఇస్తారో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మోదీ పాలనలో కార్పొరేట్ స్థాయి బడానేతలకు ప్రయోజనం తప్ప సామాన్యులకు చేసిందేమీ లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పిన మోదీ నేటికీ అమలు చేయలేదని, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ పెంచకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు.