ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మున్నూరుకాపులు భగ్గుమన్నారు. జేబు సంస్థ ఈడీని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపులకు దిగడం సరికాదంటూ రోడ్డెక్కారు. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మున్నూరుకాపులపై కత్తి గట్టడం దారుణమని ఆందోళనకు దిగారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వ్యాపారాలపై ఈడీ, ఐటీ దాడులను ఖండిస్తూ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో నిరసన తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీసీ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన కేంద్రానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కోదాడ మండలం కూచిపూడిలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఆడించినట్లు ఆడుతున్న ఈడీ నాటకాన్ని తెలంగాణ సమాజం తిప్పి కొడుతుందని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ చౌటుప్పల్‌లో విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలతో బీసీలను అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమ్‌రావు మునుగోడులో విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
– బొడ్రాయిబజార్
సూర్యాపేటలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మున్నూరు కాపులు
భువనగిరి అర్బన్, నవంబర్ 10 : ఎనిమిదేండ్ల నుంచి రాష్ర్టాభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ చేసిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చక, మళ్లీ మోసపూరిత వాగ్దానాలు చేసేందుకు ఈ నెల 12న తెలంగాణకు వస్తున్న మోదీని గో బ్యాక్ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు తెలిపారు. గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో వాణిజ్యపరంగా 2021లో ఉత్పతి ప్రారంభమైందని, ఇప్పటికే రూ.10 లక్షల టన్నులకు పైగా ఎరువుల ఉత్పత్తి సరఫరా జరిగిపోయిందని, రూ.87కోట్ల లాభం వచ్చిందని, కానీ ఈ ప్యాక్టరీని ఇప్పుడు మోదీ వచ్చి ప్రారంభించేది ఏముంటుందని ప్రశ్నించారు. బీజేపీ మునుగోడులో గెలుస్తుందని ధీమాతోనే ఎన్నికలకు ముందే ఫ్యాక్టరీ ప్రారంభం చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు ఆరోపించారు.
రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి పాత ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభం చేస్తున్నారని, దీనిని సీపీఎం పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. మతోన్మాద ఎజెండాకు తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదని మునుగోడు ప్రజలు స్పష్టంగా తీర్చు ఇచ్చారని చెప్పారు. ఇతర రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బీజేపీ వేలకోట్ల రూపాయలతో కుట్ర పన్నుతున్నదని విమర్శించారు.అదే తరహాలో ఇప్పటి వరకు 9 రాష్ర్టాలలో ప్రభుత్వాలను కూలగొట్టిందని విమర్శించారు.
ఈ దుర్బుద్ధితోనే ఇటీవల రాష్ట్రంలో కూడా నలుగురు ఎమ్మెల్యేను వందల కోట్లతో కొనుగోలు చేసేందుకు కుట్ర చేసిందని తెలిపారు. కేరళలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కూడా ఎన్నో కుట్రలు చేసిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్,రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనూరాధ, జిల్లా కార్యవర్గ సభ్యులు మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మేక అశోక్‌రెడ్డి, వడ్డేబోయిన వెంకటేశ్ పాల్గొన్నారు.