భూదాన్ పోచంపల్లి, నవంబర్ 8 : సాధారణంగా ఒకటి నుంచి పది ఆపైన రంగుల వరకు డిజైన్లతో నేసిన చేనేత వస్ర్తాలు చూసి ఉంటాం. కానీ ఒకే వస్త్రంలో పదివేల వర్ణాలు కనిపించేలా రూపొందించాడు భూదాన్ పోచంపల్లికి చెందిన బోగ బాలయ్య. అంతేకాకుండా భారతదేశ పటాన్ని అందులో వచ్చే విధంగా డిజైన్ చేశాడు. ఆజాది కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని ఆయన దేశ భక్తిని చాటుకున్నాడు. ప్రత్యేకంగా తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 21/20 మస్రెస్ నూలును తెప్పించాడు. దీనిలో పర్యావరణహితమైన రంగులు ఉపయోగించాడు.
నిలువు 100 పాయలు, పేక 100 చిటికీలతో ఈ వస్ర్తాన్ని తయారు చేశాడు. నిలువు పేక డబుల్ ట్రెడిషన్‌తో పదివేల వర్ణాలు వచ్చేలా తీర్చిదిద్దాడు. సీరియల్‌గా కండెలు చుట్టుకుని వరుస పద్ధతిలో కళాత్మకంగా నేయడం ద్వారా ఇది సాధ్యమైంది. 50 ఏండ్ల చేనేత అనుభవంతో 15 నెలలపాటు శ్రమించాడు. బ్లీచింగ్, డిజైనింగ్, వార్పింగ్, డైయింగ్, చిటికీ తదితర వాటిలో బాలయ్యకు ఆయన భార్య సరస్వతి సహకరించారు. చేనేత మగ్గంపై డబుల్ ఇక్కత్లో నేసిన వస్త్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నది.
కళాత్మకంగా తయారు చేసిన ఈ వస్ర్తాన్ని చూసిన కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి, ఒడిశా జౌళిశాఖ మంత్రి రీతూసాహూ, రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చూసి అభినందించారు. కళాత్మకంగా ఇక్కత్ వస్త్రంపై రూపొందించిన కళాకారుడు బాలయ్యను పలువురు నాయకులు, అధికారులు కళాకారులు అభినందించారు. ప్రశంసా పత్రాలను సైతం అందజేశారు.