యాదాద్రి, నవంబర్ 9 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు.
లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతు జరిపించారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు అనుబంధ రామలింగేశ్వర ఆలయంతో కార్తీక దీపారాధనలో భక్తులు పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. కొండ కింద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 6వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.8,69,244 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రీశుడి 13రోజుల హుండీల ఆదాయం రూ.1,20,32,052 వచ్చిందని ఈఓ ఎన్.గీత తెలిపారు. యాదాద్రి కొండ కింద వ్రత మండపంలో హుండీలను లెక్కించినట్లు తెలిపారు. నగదుతో పాటు, మిశ్రమ బంగారం 113గ్రాములు, మిశ్రమ వెండి 2.100కిలోలు వచ్చిందని తెలిపారు. వీటితో పాటు 143 అమెరికా డాలర్లు, 100 యూఏఈ ధిరామ్స్, 200 కెన్యా సిల్లింగ్, 20 జింబాబ్వే డాలర్లు, 20 ఫ్రాన్స్ స్విస్, 1000 వెస్ట్ ఆఫ్రికా మిల్లే ఫ్రాన్స్, 5 యూరో, 200 కెనడా డాలర్స్ సమకూరిందని తెలిపారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 39,000
వీఐపీ దర్శనాలు 22,500
బ్రేక్ దర్శనాలు 24,300
వేద ఆశీర్వచనం 4,200
ప్రచార శాఖ 20,450
వ్రత పూజలు 92,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 20,250
ప్రసాద విక్రయం 4,10,240
వాహనపూజలు 4,900
శాశ్వత పూజలు 85,000
అన్నదాన విరాళం 28,168
సువర్ణ పుష్పార్చన 30,000
యాదరుషి నిలయం 14,896
పాతగుట్ట నుంచి 20,840
కొండపైకి వాహన ప్రవేశం 1,00,000
శివాలయం 5,000