రామగిరి, నవంబర్ 9 : చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, ఇందుకు న్యాయ సేవాధికార సంస్థ, పారా లీగల్ వలంటర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఎస్.జగ్జీవన్‌కుమార్ కోరారు. ‘న్యాయ సేవ దినోత్సవాన్ని’ పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రారంభించి మాట్లాడారు.
సమాజంలోని పేదలు, కోర్టులకు రాలేని వారు న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయిస్తే సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా సాయం అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారా లీగల్ వలంటర్లు, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయసేవ శిబిరాలు నిర్వహిస్తూ చట్టలపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కక్షిదారులకు సత్వర న్యాయం అందించేలా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్ధ ఆదేశాలతో నిర్వహించే ‘లోక్ అదాలత్’లో ఇరుపక్షాల సమ్మతితో తీర్పు వస్తుందన్నారు.
లోక్ అదాలత్‌లో తీర్పు వస్తే తిరిగి మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదన్నారు. కోర్టుకు అయిన ఖర్చులను తిరిగి క్షకిదారులకు అందిస్తారన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలకు న్యాయ చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పించి చైతన్యం చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.దీప్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వివిధ కోర్టుల న్యాయమూర్తులు జయరాజు, తిరుపతి, కీర్తిచంద్రికారెడ్డి, కార్తీక్, న్యాయవాదులు నిమ్మల బీమార్జున్‌రెడ్డి, జవహర్లాల్, అధికారులు పాల్గొన్నారు.
న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండలోని కోర్టు ఆవరణలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆలోచింపజేయడంతో పాటు ఆకట్టుకున్నాయి. ఆయా శాఖలకు ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు.
నల్లగొండలో న్యాయ విద్య చదువుతున్న విద్యార్థులు చేపట్టిన అవగాహన ర్యాలీని కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు ప్రారంభించారు. అక్కడి నుంచి న్యాయవాదులు, పారాలీగల్ వలంటర్లు, న్యాయ విద్యార్థులు పట్టణంలోని గడియారం సెంటర్ వరకు ర్యాలీ తీసి న్యాయ సేవా సంస్థ అందించే సేవలను ప్రజలకు తెలిపారు.