వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 296 కేంద్రాలకుగానూ ఇప్పటికే 237 సెంటర్లు ప్రారంభమయ్యాయి. 5లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు అంచనాతో జిల్లా అధికారులు అవసరమమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వర్షం వస్తే ధాన్యం తడువకుండా ఉండేందుకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా కోటీ 50 లక్షల సంచులు, ధాన్యం రవాణాకు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ధాన్యం విక్రయించి రైతులకు వీలైనంత త్వరగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతాంగం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మి, మద్దతు ధర పొందేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : జిల్లా వ్యాప్తంగా 296 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా వానకాలం ధాన్యం కొనుగోలుకు ఇప్పటికే 237 కేంద్రాలను ప్రారంభించారు. వీటి ద్వారా ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వివిధ కేంద్రాల్లో 33వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. అధికారులు ఇప్పటికే జిల్లా దిగుబడి అంచనాలతో వానకాలం కొనుగోళ్లపై యాక్షన్ ప్లాన్ రూపొందించారు. జిల్లాలో సుమారు 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు 5 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం 50 శాతం వరికోతలు పూర్తికాగా మిగతావి కోత దశలో ఉన్నాయి. దాంతో దశలవారీగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. డిసెంబర్ నెలాఖరు వరకు మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సారి వానకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 240వాహనాలు, 6వేల టార్పాలిన్లు, 700 తూకం వేసే పరికరాలు, 1200 తేమ నిర్ధారించే మీటర్లు అందుబాటులో ఉంచారు. మొత్తం 1.50 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం 70లక్షల బ్యాగులు సిద్ధంగా ఉండగా మరో 80లక్షల బ్యాగులు రానున్నాయి. మరోవైపు రైతులు తేమశాతం, తాలు లేకుండా ధాన్యం ఆరబెట్టుకొని తీసుకొచ్చేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సహాయ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులతో పాటు పౌరసరఫరాల అధికారులు సమన్వయం చేసుకుంటూ కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని అంచనా వేసే పనిలో నిమగ్న మయ్యారు.
మిల్లుల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించారు. 25 మంది ఎప్పటికప్పుడు మిల్లుల వద్ద ఉండి కొనుగోళ్లను పర్యవేక్షించనున్నారు. రైతులను మధ్యవర్తులు మభ్యపెడితే తమ దృష్టికి తేవాలని సూచిస్తున్నారు. అయితే ఇటీవల సెలవులతో ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా జరిగాయని, కొనుగోళ్లు వేగవంతం చేస్తామని పౌరసఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
బొమ్మలరామారం మండలంలో 12వేల బస్తాల ధాన్యం సేకరణ
బొమ్మలరామారం, నవంబర్ 9 : మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే 12వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంతోపాటు మేడిపల్లి, మైలారం, నాగినేనిపల్లి, హాజీపూర్, రామలింగంపల్లి, జలాల్పూర్, చీకటిమామిడి, తిమ్మాపూర్, మర్యాల, చౌదర్పల్లి, పీజీతండాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఇప్పటి వరకు 80మంది రైతుల నుంచి 12వేల బస్తాలు కొనుగోలు చేశా రు. మరో 30 రోజుల్లో 2 లక్షల బస్తాల సేకరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గత యా సంగిలో 850 మంది రైతుల నుంచి 1.30లక్షల బస్తాల ధాన్యం సేకరించారు. ఇందుకు సంబంధించి రూ.10.90కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు.
ధాన్యానికి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దక్కాలంటే రైతులు అధికారుల సూచనలు పాటించాలి. రైతులు తమ ధాన్యాన్ని ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రం చేసి, ఎండబెట్టి కేంద్రాలకు తీసుకు రావాలి. నేలపై టార్పాలిన్, ప్లాస్టిక్ సంచులు వేసిన తర్వాతే ధాన్యం వేయాలి. నూర్పిళ్లలో రాళ్లు, మట్టి పెడ్డలు, చెత్తాచెదారం వంటివి లేకుండా శుభ్రం చేయాలి. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తీసుకు రావాలి.
ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చేముందు తాలు గింజలు, కల్తీ గింజలు, పొల్లు లేకుండా చూసుకోవాలి. రైతులు తమ ఫోన్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న తర్వాతే కేంద్రానికి తేవాలి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించే సమయంలో ఓటీపీ నంబర్ కోసం రైతులు ఫోన్‌ను తమ వద్దే ఉంచుకోవాలి. ఓటీపీ వచ్చాకే కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రైతులు ధాన్యాన్ని శాంపిల్‌గా చూపించి టోకెన్ తీసుకోవాలి. తూకం వేసిన తర్వాత విధిగా రసీదు పొందాలి.
నల్లగొండ, నవంబర్ 8 : వానకాలం సీజన్ ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు షురూ చేశారు. ఇప్పటి వరకు 36,807 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ఏడాది వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5,04,208 ఎకరాల్లో వరి సాగు చేయగా 12.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయం శాఖ అంచనా వేసింది.
ఇందులో మిల్లర్లు 4.58 లక్షలు కొనుగోలు చేయగా, స్థానిక అవసరాలు పోను ప్రభుత్వ రంగ మార్కెట్లకు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ ధాన్యాన్ని పూర్తిస్థ్దాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ఐకేపీ ఆధ్వర్యలో 102 కేంద్రాలు, పీఏసీఎస్ ఆధ్యర్యంలో 147 కేంద్రాలు, మొత్తం 249 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం 180 కేంద్రాలు ప్రారంభించి కొనుగోల్లు ప్రారంభించారు.