నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 9(నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో ఆయనతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం చేయించనున్నారు. దాంతో ప్రభాకర్‌రెడ్డి రెండోసారి మునుగోడు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినట్లు అవుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితోపాటు ఇతర మంత్రులు, ఎంపీలు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలు హాజరు కానున్నారు.
గతంలో 2014 మేలో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ సమయంలోనే నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. అప్పట్లో ప్రత్యర్థి మాయ మాటలు, బూటకపు హామీలకు మోసపోయి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు.
ఆ పార్టీ నుంచి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతోపాటు ప్రభుత్వంపై నిందలు వేస్తూ, సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10,309 ఓట్ల మెజార్టీతో బీజేపీపై ఘన ఎమ్మెల్యేగా నేడు కూసుకుంట్ల ప్రమాణ స్వీకారం విజయం సాధించారు. సుమారు ఏడాదిపాటు ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే పదవిలో కొనసాగనున్నారు.
ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే సీఎం కేసీఆర్ మునుగోడు అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మిగిలి ఉన్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసేలా త్వరలో కార్యాచరణ సిద్ధం చేసేందుకు సన్నాహకలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా నమస్తే తెలంగాణకు వివరించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తానన్నారు. కాగా, కూసుకుంట్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మునుగోడు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సిద్ధమవుతున్నారు.