రామగిరి, నవంబర్ 8: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యలో మార్పులు తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి మార్గాలను అందించే విద్యను బోధించడమే లక్ష్యంగా ‘క్లస్టర్ విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు ఈ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించింది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లాలోని 9 ప్రభుత్వ కళాశాలలను రెండు క్లస్టర్లుగా విభజించి ఈ విధానం అమలు చేయనున్నారు.
ఎంతో ఉపయోగకరం
డిగ్రీ విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో ఉన్నత విద్యామండలి క్లస్టర్ విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు తమకు ఏ కళాశాలలో సీటు వస్తే అదే కళాశాలలోని వనరులు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ క్లస్టర్ విధానంతో క్లస్టర్ పరిధిలోని కళాశాలల్లో ఉత్తమ అవకాశాలు ఉన్న మరో కళాశాలకు వెళ్లి అక్కడ ల్యాబ్, లైబ్రరీ, క్రీడా మైదానాలు, అధ్యాపకుల సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాశాల విద్యార్థులు తమ కళాశాలలో లేని వనరులను క్లస్టర్ పరిధిలోని కళాశాలకు వెళ్లి ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది.
ప్రయోజనాలు
నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఎన్జీ) అటానామస్ హోదాతో కొనసాగుతున్నది. యూనివర్సిటీల్లో ఉన్నట్లుగానే ఎన్జీ కళాశాలలో కూడా ఆధునిక వసతులు ఉన్నాయి. అయితే ఈ కళాశాల క్లస్టర్ పరిధిలో ఉన్న కళాశాల విద్యార్థులకు వసతులు లేని పక్షంలో వారు ఎన్జీ కళాశాలకు వచ్చి ఇక్కడి వనరులను వినియోగించుకోవచ్చు.
క్లస్టర్ పరిధిలో అధ్యాపకుల కొరత ఉంటే సమీపంలోని కళాశాలకు చెందిన అధ్యాపకుల సేవలను క్లస్టర్ కళాశాల ప్రిన్సిపాల్ కోరిక మేరకు ఆయా కళాశాలల్లో వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
దాంతో పాటు క్లస్టర్ కళాశాలలో ఉన్న సర్టిఫికెట్ కోర్సులు, కంప్యూటర్ సెంటర్లు, క్రీడామైదానాలు, క్రీడా సామగ్రిని వినియోగించుకోవచ్చు.
లాంగ్వేజ్ స్కిల్స్, ఇంగ్లిష్, ల్యాబ్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, జవహర్ నాలెడ్జ్ సెంటర్ వసతులు వినియోగించుకోవచ్చు. మరో వైపు రాష్ట్ర ఫ్రభుత్వ అమలు చేసే నైపుణ్యాభివృద్ధి (టాస్క్)అంశాలను సులభంగా వినియోగించుకోవచ్చు. ‘జిజ్ఞాస’ వంటి పరిశోధన తరగతులు కూడా వినియోగించుకోవచ్చు.
ఈ పద్ధతితో క్లస్టర్ కళాశాలల్లోని సౌకర్యాలను విద్యార్థులు సులభంగా తమ కళాశాల ఐడీ కార్డు చూపించి వినియోగించుకోవచ్చు. దాంతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెరగడంతో పాటు సాంకేతిక అంశాల్లో నైపుణ్యం పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది.
ఎంజీయూ పరిధిలో రెండు క్లస్టర్లు
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 9 ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రెండు క్లస్టర్లుగా విభజించారు. ఇందులో అటానమస్‌గా ఉన్న నాగార్జున ప్రభుత్వ కళాశాల , ఉమ్మడి జిల్లాలో ఏకైక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను క్లస్టర్ కళాశాలలుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి అనుబంధంగా మిగిలిన కళాశాలను అటాచ్ చేస్తారు.
కలిగే లాభాలు
క్లస్టర్ పరిధిలోని అన్ని కళాశాలకు సంబంధించి ఒకే అకాడమిక్ విధానాన్ని అమలు చేసుకోవచ్చు.
విద్యార్థులకు అనుగుణంగా కొత్త కోర్సులను అమలు చేసే అవకాశం కలుగుతుంది.
ఆయా క్లస్టర్ పరిధిలోని అధ్యాపకులు తమ అనుభవాలను పంచుకొని, అవగాహన పెంచుకొని ఉత్తమ బోధన అందించే అవకాశం ఏర్పడుతుంది.
అడ్మిషన్స్లో ఐసీటీని వినియోగంచుకుని పరిశీలన చేసే అవకాశం కలుగుతుంది.
క్లస్టర్ పరిధిలోని విద్యార్థుల్లో సంస్కృతి, సంప్రదాయ విలువలు పెంచడంతో పాటు స్నేహపూర్వక వాతావరణం కలిగించడంతో పాటు క్రీడలు నిర్వహించి విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంటుంది.
పరిశోధన అంశాలతో విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు.