హుజూర్నగర్, నవంబర్ 8 : ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఇలా నిత్య జీవితంలో ఎన్నో పనులకు ఆధార్‌కార్డు తప్పనిసరి. అయితే కార్డు పొంది పదేండ్లు గడిచిన వారంతా వీలైనంత త్వరగా తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) సూచిస్తోంది. 2015 కంటే ముందు ఆధార్ కార్డు పొందిన వారు తప్పకుండా నవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రారంభంలో వేలి ముద్రలు, ఫొట్, చిరునామా, సెల్ ఫొన్ నంబర్, ఇతర వివరాలు మారిన వెంటనే ఆప్డేట్ చేసుకోవడం మేలని సూచిస్తున్నారు. గుర్తింపునకు పదో తరగతి మెమో, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్‌లలో ఏదో ఒకటి జతపర్చాలి. సాధారణంగా చిన్నారులు ఆధార్ కలిగి ఉంటే వారికి తల్లిదండ్రుల వేలి ముద్రలతో కార్డులు జారీ చేస్తారు. అయిదేండ్లు నిండాక వారి వేలి ముద్రలు, ఫొటో ఆప్డేట్ చేయించుకోవాలి. ప్రజలు చాలా మంది అవగాహన లేక చిన్నారుల ఆధార్‌ను అప్డేట్ చేయించుకోవడం లేదు.
ఆప్‌డేట్‌తో ప్రయోజనాలు ..
ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు కార్యక్రమంలో లబ్ధిదారులైన వలస కూలీలు పని చేస్తున్న పట్టణాల నుంచే రేషన్‌కార్డుపై అందించే రాయితీ బియ్యం పొందవచ్చు. బ్యాంకు ఖాతా తెరవడం, సిమ్ కార్డు పొందడం ఎంతో సులువుగా ఉంటుంది. ఇతర పథకాలకు మెరుగైన సదుపాయం ఉంటుంది.