ఉద్యోగులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి రవాణా శాఖ వారి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నది. మంగళవారం నుంచి ఈ నెల 30 వరకు డిపోల వారీగా ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందికి వైద్య పరీక్షలు చేయనుంది. అద్దె బస్సుల సిబ్బందికి సైతం అవకాశం కల్పించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 3,800 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. 17 రకాల వైద్య పరీక్షలు చేసి భవిష్యత్లో ఉపయోగపడే విధంగా హెల్త్ ప్రొఫైల్ను రూపొందించనున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు కార్యక్రమం జరుగుతుండడంతో నవంబర్ నెలను హెల్త్ అండ్ ఛాలెంజ్ మంత్గా ఆర్టీసీ నామకరణం చేసింది. ఆర్టీసీలో పని చేస్తున్న రీజియన్ పరిధిలోని 3,800 మంది ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్ను సిద్ధంచేయనున్నారు.
ఒకొక్కరికి 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం ‘కాల్ హెల్త్ ప్రైవేట్’ అనే సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరీక్షల కోసం ఆర్టీసీ ఒక్కో ఉద్యోగికి రూ.333 చొప్పున ఆ సంస్థకు చెల్లించనున్నది. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రయాణికులు క్షేమంగా గమ్యం చేరుతారన్న ఉద్దేశంతో వారికి వైద్య పరీక్షలు చేయనున్నారు. డ్రైవర్లకే కాకుండా అన్ని స్థాయిల్లోని సిబ్బందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇది బృహత్ సంక్షేమ కార్యక్రమంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేపట్టారు. బీపీ, ఘగర్, దూర, దగ్గరి దృష్టి, ఈఎన్టీ, ఈసీజీ తదితర పరీక్షలు చేస్తారు.
ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు చేయనున్నారు. గతంలో 45 సంవత్సరాల్లోపు వారికి ఒకసారి, 45 పైన ఉన్న వారికి రెండు సార్లు కంటి పరీక్షలు నిర్వహించే వారు. తాజాగా 17 రకాల పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల అనంతరం వారి వ్యక్తిగత ఆర్యోగ సమాచారాన్ని పొందుపర్చనున్నట్లు తెలిపారు.
వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగులను నాలుగు కేటగిరీలుగా విభజిస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు, రెండు మూడు వ్యాధ్యులు ఉన్నవారు, వైద్యం అవసరం అయినవారు, అత్యంత తీవ్రంగా సమస్యలు ఉన్నవారిని గుర్తించి వైద్యం అందిచనున్నారు.
రీజియన్ పరిధిలో 7 డిపోలు ఉండగా నేటి నుంచి 12 వరకు దేవరకొండ, యాదగిరిగుట్ట డిపోలకు చెందిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.12 నుంచి 20 వరకు నల్లగొండ, 13న నార్కట్పల్లి, 14నుంచి 19 వరకు సూర్యాపేట, 20 నుంచి 24వరకు కోదాడ, 25 నుంచి 30 వరకు మిర్యాగూడ డిపోలతోపాటు అద్దె బస్సుల సిబ్బందికి పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సంస్థ ఎండీ సజ్జనార్ సూచనల మేరకు ఏర్పాట్లు పూర్తి చేశాం. వైద్యుల సూచనల మేరకు ప్రతి ఉద్యోగి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆహార నియమాల కోసం డైటీషియన్ అందుబాటులో ఉంచుతాం.
-కేశవులు, డీవీఎం