సూర్యాపేట, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది సోమా భరత్ నియామకమయ్యారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ ప్రగతిభవన్‌లో భరత్‌కుమార్‌కు నియామకపత్రం అందించారు. ఆయన ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన భరత్‌కుమార్ 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ్యులుగా ఉన్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి కనబర్చారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కళాశాలలో చదువుతున్న సమయంలో పీడీఎస్‌యూ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
లా విద్యను పూర్తి చేసిన ఆయన ప్రముఖ అడ్వకేట్ కన్నాభిరాం వద్ద జూనియర్ లాయర్‌గా పనిచేశారు. అనంతరం సొంతంగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసుల పాలైన ఎంతో మంది ఉద్యమకారులకు ఉచిత న్యాయ సేవలు, పార్టీకి కూడా న్యాయ సలహాలు అందిస్తూ వస్తున్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, భరత్కుమార్ది ఒకే మండలం కావడంతో పాటు ఇద్దరూ ఉద్యమ, రాజకీయ సహచరులు. 2001 నుంచి నేటి వరకు టీఆర్ఎస్లోనే కొనసాగుతూ వస్తున్న ఆయన ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా నియమించారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నత శిఖరాలకు చేరుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ గుబాలిస్తుండగా తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. తదనుగునంగా సీఎం కేసీఆర్ జిల్లాకు కార్పొరేషన్ పదవుల విషయంలో పెద్ద పీట వేస్తున్నారు. జిల్లాకు చెందిన దూదిమెట్ల బాలరాజు గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కాగా రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ కో-ఆపరేటివ్ చైర్మన్ రామచందర్‌నాయక్, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కంచర్ల రామకృష్ణారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా మేడె రాజీవ్‌సాగర్ ఉండగా తాజాగా సోమా భరత్‌కుమార్ కూడా కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు భరత్‌కుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. భరత్‌కుమార్‌కు కార్పొరేషన్ పదవి రావడంపై ఆర్యవైశ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.