రాజాపేట, నవంబర్ 7 : రాజాపేట మండలకేంద్రంలోని పీహెచ్సీలో రోగులకు కార్పొరేట్ దవాఖానలకు దీటుగా వైద్య సేవలందిస్తున్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండలంలోని 23 గ్రామాల ప్రజలు వివిధ రకాల వైద్య పరీక్షల కోసం దవాఖానకు వస్తుంటారు. నిత్యం 120 నుంచి 150 మందికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలో దవాఖానలో 50 మందికి పైగా నార్మల్ డెలివరీలు చేయడం విశేషం. కార్పొరేట్‌కు ధీటుగా వైద్య సేవలు అందుతుండడంతో దవాఖాన రోగులతో కిటకిటలాడుతున్నది.
సర్కారు దవఖానలో ఎల్లవేళలా వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ప్రైవేటు దవాఖానకు పోతే ఇవే పరీక్షలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందిస్తుండడంతో సర్కారు వైద్యంపై బరోసా పెరిగింది. రోగం వచ్చినా, నొప్పొచ్చినా సర్కారు దవఖానలోనే మంచిగా చూస్తున్నారు.
– బొడ్డు భూపాల్, రేణికుంట
ప్రభుత్వ దవాఖానలో సకల సౌకర్యాలు కల్పించి ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాం. అన్ని రకాల వైద్యపరీక్షలతో పాటు మందులను అందుబాటులో ఉంచాం. ప్రైవేటు దవాఖానను ఆశ్రయించి అప్పులపాలు కావొద్దు. వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
– భరత్‌కుమార్, మండల వైద్యాధికారి, రాజాపేట