మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 10: మిర్యాలగూడ పట్టణాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దేందుకు మున్సిపల్ పాలకవర్గం శ్రీకారం చుట్టింది. రూ. 23 లక్షలతో పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచడంతో పాటు మున్సిపాలిటీని సుందరంగా మార్చేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సెలవుదినాల్లో, సాయంత్రం వేళల్లో పట్టణ ప్రజలు ఆయా ప్రాంతాల్లో సరదాగా గడుపుతున్నారు.
బోటింగ్ పార్క్‌లో
హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కనిపించే ఆకర్షణీయమైన హోర్డింగ్‌లు ప్రస్తుతం మిర్యాలగూడలో దర్శనమిస్తున్నాయి. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ నుంచి నల్లగొండకు వెళ్లే రోడ్డుపై ప్రధాన కూడలిలో ఇటీవల రూ.5లక్షలతో వెల్కమ్ మిర్యాలగూడ అనే హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. దాంతో పాటు బోటింగ్పార్క్లో మరో రూ.5లక్షలతో లవ్ మిర్యాలగూడ, సుందరయ్య పార్కులో రూ.8 లక్షలతో నాగార్జునసాగర్ మోడల్ డ్యామ్‌తో పాటు పురపాలకసంఘం పేరుతో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
యువత సందడి
మిర్యాలగూడ పట్టణానికి నాలుగువైపులా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల వద్ద యువత సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పట్టణ ప్రజలే కాకుండా పరసర ప్రాంతాల నుంచి వచ్చే వారు ముఖ్యంగా విద్యార్థులు బోటింగ్పార్కు వద్ద ఉన్న హోర్డింగ్‌ల వద్ద ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. దాంతో పాటు పార్కులో ఉన్న వివిధ రకాల ఆకృతులు వారిని మరింత ఆకట్టుకుంటున్నాయి. సెలవు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో రద్దీ నెలకొంటున్నది. సుందరయ్యపార్కులో ఏర్పాటు చేసిన నాగార్జునసాగర్ మోడల్ డ్యాం, మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాత్రివేళల్లో విద్యుత్ దీపాల వెలుగులో వాటర్ ఫౌంటెయిన్ మరింతగా ఆకట్టుకుంటున్నది. హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతంలో పచ్చగడ్డితో పాటు రంగు రంగుల మొక్కలను పెంచుతున్నారు.
పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతాం
మిర్యాలగూడను అందంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు సహకారంతో కృషి చేస్తున్నాం. మిర్యాలగూడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. అందుకే ఇక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వారికి ఆహ్లాదం పంచేందుకు ఇప్పటికే రూ.10కోట్లతో పనులు చేపట్టాం. అందులో భాగంగా రూ.23లక్షలతో పలు ప్రాంతాల్లో అందమైన హోర్డింగ్‌లు ఏర్పాటు చేశాం. రూ.5లక్షలతో సుందరయ్య పార్కులో వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేశాం.
– తిరునగర్ భార్గవ్, మున్సిపల్ చైర్మన్, మిర్యాలగూడ